సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ సబ్జెక్టులోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించినా, ఇందుకు సంబంధించిన సన్నద్ధత ఎక్కడా కన్పించడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో దీనిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది. అసలీ సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయా? ఉండవా? అనే అనుమానం విద్యార్థులతో పాటు అధ్యాపకుల నుంచీ వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు సాధారణ క్లాసులే కొనసాగుతుండటం, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌పై ఏ విధమైన కసరత్తు ప్రారంభం కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదని అధ్యాపకులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలుంటాయని, మొదట్నుంచీ సరైన శిక్షణ లేకుంటే పరీక్షలు ఎలా రాస్తారని కొంతమంది అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్స్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మాక్ టెస్టులు నిర్వహించడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
దసరా తర్వాత కార్యాచరణ
ఈ ఏడాది నుంచే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. దసరా తర్వాత అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రయల్పింస్తున్నాం. అధ్యాపకులకూ దీనిపై స్పష్టత వచ్చేలా చేస్తాం. ఇంటర్ ప్రవేశాలు ఇంకా జరుగుతున్న కారణంగా ప్రాక్టికల్స్‌కు సమయం ఉంది. –జయప్రదాభాయ్ (ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి)
విధివిధానాలు విడుదలైతే స్పష్టత
ఇంగ్లీష్‌లో ప్రాక్టికల్స్ తీసుకురావాలన్న ప్రయోగం మంచిదే. దీనిపై అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విధివిధానాలపై బోర్డు త్వరలో స్పష్టత ఇస్తుందని భావిస్తున్నాం. – మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కన్వీనర్)
ఆఖరులో హడావుడితో నష్టం
ఆంగ్ల సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. విద్యార్థి ఒక నిమిషంలో తనకు నఇంగ్లీష్ న టాపిక్‌లో మాట్లాడటం, రికార్డు రాయడం, విద్యార్థులు ఇంగ్లీష్‌లో ముచ్చటించడం, ఇంగ్లీష్ చదవడం అనే అంశాలు ప్రాక్టికల్స్‌లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా అంశం గురించి మాట్లాడటం అనే దానిపై తరగతి గదిలో తర్ఫీదు అవ్వాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు.
లేనిపక్షంలో అప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్‌పై బట్టీ పట్టి వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రయోజనం ఏమిటని ప్రన్పిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్‌పై పట్టు పెరగాలంటే విద్యార్థులు పరస్పరం ఇంగ్లీష్‌లో సంభాషించుకోవడం ముఖ్యం. ఈ ఉద్దేశంతోనే దాన్ని ప్రాక్టికల్స్‌లో చేర్చారు. మరికొద్ది నెలల్లో పరీక్షలు జరగనుండగా ఇప్పటికీ ఈ తరహా ప్రయోగాలు కాలేజీల్లో జరగడం లేదు.
రికార్డుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. తీరా పరీక్షల ముందు హడావుడి చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు చాలావరకు ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ మొత్తం పూర్తయి రివిజన్‌కు వెళ్తున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌పైనా విద్యార్థులకు శిక్షణ నడుస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment