
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే చర్యల్లో భాగంగా ‘జెన్–2’ రకానికి చెందిన రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆదివారం ట్యాంక్‌బండ్, దుర్గం చెరువు వద్ద ప్రదర్శనకు ఉంచనున్నారు.
దేశంలో ఫార్ములా–ఈ పోటీలను నిర్వహించడం తొలిసారి కానుండటంతో హైదరాబాద్‌తోపాటు ముంబై ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లోనూ ఈ కార్లను కొన్ని వారాలపాటు ప్రదర్శించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్ములా వన్ కార్ల తరహాలోనే నేలను తాకినట్లుగా ఉండే ఆకృతి, ఓపెన్ కాక్‌పిట్, సింగిల్ సీట్‌గల ఈ కార్లు ‘ఈవీ టెక్నాలజీ’ (ఎలక్ట్రికల్ వెహికల్ సాంకేతికత) ఆధారంగా పనిచేస్తాయి.
హైదరాబాద్‌లో జరిగే పోటీలో జెన్–3 రకం ఈవీ కార్లను తొలిసారిగా ప్రవేశపెట్టనున్నారు. జెన్–2 ఈవీ కార్లు సున్నా నుంచి 62 కి.మీ. వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటే జెన్–3 రకం ఈవీ కార్లు సున్నా నుంచి 100 కి.మీ. వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయి. జెన్–2 ఈవీ కార్లు గరిష్టంగా 280 కి.మీ. వేగాన్ని అందుకుంటే జెన్–3 ఈవీ కార్లు గరిష్టంగా 300 కి.మీ. వేగంతో దూసుకెళ్తాయి.
ఫార్ములా వన్ రేసుల్లాగా వీటికి ప్రత్యేక ట్రాక్‌లు నిర్మించాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ రోడ్లపైనే పరుగులు తీయగలగడం ఈవీ కార్ల ప్రత్యేకత. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న 2.8 కి.మీ. మార్గం ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీలకు అనుకూలంగా ఉండటం వల్లే భాగ్యనగరాన్ని నిర్వాహకులు ఇందుకు ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూలై మధ్య ప్రపంచవ్యాప్తంగా 12 నగరాల్లో జరగనున్న 18 ఫార్ములా–ఈ ప్రిక్స్ రేసుల్లో నాలుగో రేసు హైదరాబాద్‌లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment