నాటి విజిలెన్స్‌ నివేదికతోనే ఈడీ సోదాలు | ED IT Raids In Karimnagar Continue | Sakshi
Sakshi News home page

నాటి విజిలెన్స్‌ నివేదికతోనే ఈడీ సోదాలు

Published Fri, Nov 11 2022 12:37 AM | Last Updated on Fri, Nov 11 2022 12:37 AM

ED IT Raids In Karimnagar Continue - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కొత్తపల్లి: గ్రానైట్‌ మైనింగ్‌లో అవకతవకలు, పన్నుల ఎగవేత, హవాలా తదితర ఆరోపణలపై కరీంనగర్‌లో రెండో రోజూ ఈడీ, ఐటీ శాఖల సోదాలు కొనసాగాయి. పట్టణ శివారులోని కొత్తపల్లిలో ఉన్న అరవింద గ్రానైట్స్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్, దక్కన్‌ గ్రానైట్స్, గాయత్రీ గ్రానైట్స్, సంధ్యా గ్రానైట్స్‌ తదితర కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో అధికారులు గురువారం సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి పంచనామాలను అందజేశారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న దాడులకు ఉమ్మడి ఏపీలోని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికే కారణం. ఆయా గ్రానైట్‌ కంపెనీల అవకతవకల వల్ల ప్రభుత్వానికి మొత్తంగా రూ.124.94 కోట్ల మేర నష్టం వచ్చినట్లు ఉమ్మడి ఏపీలో విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా కంపెనీలపై 5 రెట్లు పెనాల్టీ కలిపి రూ.749.66 కోట్ల మేర జరిమానా (సినరేజీ ఫీజు)ను అప్పటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ అధికారులు విధించారు.

అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయా కంపెనీలు ఐదు రెట్ల పెనాల్టీని ఒక వంతుకు (మెమో నం.6865/ఆర్‌1/2016) తగ్గించుకున్నాయి. గతేడాది ఆగస్టు నాటికి రూ. 11 కోట్ల వరకు పెనాల్టీ చెల్లించాయి. ఈ ఏడాదికాలంలోనూ మిగిలిన మొత్తాన్ని చెల్లించామని కంపెనీలు చెబుతున్నాయి.

షిప్పింగ్‌ కంపెనీల నుంచి వివరాలు..!
గ్రానైట్‌ మైనింగ్‌లో అక్రమాలపై ఈడీ అధికారులు అన్ని మార్గాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్‌లో ఉత్పత్తి అయిన గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణ్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు గుర్తించి ‘ఎలైట్‌ షిప్పింగ్‌ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు ఇప్పటికే లేఖ రాశారు.

శ్వేత ఏజెన్సీస్, ఏఎస్‌ షిప్పింగ్, జేఎం బక్సీ అండ్‌ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్‌ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్‌ఆర్‌ ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్‌/వేంకటేశ్వర లాజిస్టిక్స్‌ కంపెనీలు.. కరీంనగర్‌ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్‌ విదేశాలకు తరలించాయి? కంపెనీల వివరాలు, యజమానులు/భాగస్వాముల తదితర వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారని సమాచారం. వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగనుంది.

ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారు:  గంగుల 
పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. ఈడీ దాడులకు నిష్పక్షపాతంగా సహకరిస్తామని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం బద్ధిపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ముందుకు సాగుతున్న తెలంగాణపై ఢిల్లీ పాలకులకు మంట మొదలైందని, తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు.

తెలంగాణ రాకముందు గుడ్డి దీపాలుగా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వెలుగులీనుతున్నాయన్నారు. కాళేశ్వరంతో చెరువులన్నీ నింపడంతో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని, ఉచిత విద్యుత్, రైతుబంధు, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతును రాజు చేసేందుకు కేసీఆర్‌ కంకణబద్ధులయ్యారని తెలిపారు. బొగ్గు, కరెంట్‌ను తీసుకెళ్లి తెలంగాణను అంధకారం చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై ఎందుకీ వివక్ష ? పైసలున్న వాళ్లంతా బీజేపీకి వేళ్తే సమ్మతమా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం అంబానీ, ఆదానీలకు తెలంగాణలో చోటు లేదని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement