ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు... 15 బృందాలతో ఏకకాలంలో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.
విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్‌ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం.
కేసు వివరాలివీ..: హాంగ్‌కాంగ్‌లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క
ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment