సాక్షి, చార్మినార్: చారిత్రక చార్మినార్ కొత్త శోభను సంతరించుకోనుంది. నేటి సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్యాంక్‌బండ్ తరహాలోనే నో ట్రాఫిక్ జోన్‌గా మారనుంది. సందర్శకులకు మాత్రమే అనుమతించనున్నారు. ‘ఏక్ షామ్.. చార్మినార్‌కే నామ్’ కార్యక్రమానికి ఈ ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు చార్మినార్ పరిసరాల్లోకి వాహనాల అనుమతించబోమని శనివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు, సందర్శకుల పార్కింగ్ వివరాలను ఆయన వెల్లడించారు. వాహనచోదకులు, సందర్శకులు సహకరించాలని కొత్వాల్ సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
అఫ్జల్‌గంజ్, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్ హౌస్ నుంచి మేతీ కా షేర్, కాలీకమాన్, ఏతిబజార్ వైపు పంపిస్తారు. ఫలక్‌నుమా, హిమ్మత్‌పురా వైపు నుంచి వచ్చే వాటిని పంచ్‌మొహల్లా నుంచి షా ఫంక్షన్ హాల్, మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ రోడ్, బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. బీబీ బజార్, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ధన్కా మాస్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను సర్దార్ మహల్ నుంచి కోట్ల అలీజా, ఏతీ బజార్ చౌక్ వైపు పంపిస్తారు. ముసాబౌలి, ముర్గీ చౌక్, ఘాన్సీ బజార్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్ బజార్, మోతీగల్లీల వద్ద నుంచి ఖిల్వత్ రోడ్‌లోకి పంపుతారు.
పార్కింగ్ ప్రాంతాలివీ..
అఫ్జల్‌గంజ్, నయాపూల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సర్దార్ మహల్‌లోని జీహెచ్‌ఎంసీ ఆఫీస్ లోపల, కోట్ల అలీజాలోని ముఫీద్ ఉల్ ఆనం బాయ్స్ హై స్కూల్‌లో పార్క్ చేసుకోవాలి. ముర్గీ చౌక్, శాలిబండ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను మోతీగల్లీ పెన్షన్ ఆఫీస్, ఉర్దూ మస్కాన్ ఆడిటోరియం, ఖిల్వత్ గ్రౌండ్స్, చార్మినార్ సమీపంలోని ఏయూ హాస్పిటల్, చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్ గేట్ వద్ద పార్క్ చేసుకోవాలి. మదీనా, పురానాపూల్, గోషామహల్ నుంచి వచ్చే సందర్శకులు తమ వాహనాలను కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజ్, ఎంజే బ్రిడ్జి వద్ద పార్క్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment