సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డి స్కం)లు కొత్తగా ‘దివాలా’ముప్పు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ డిస్కంలకు కూడా దివాలా స్మృతి సంపూర్ణంగా వర్తిస్తుందని.. దివాలా వ్యా పార పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్/సీఐఆర్పీ) కింద వాటిపై చర్యలు తీసుకోవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. దీనితో అప్పులు, బకాయిలు చెల్లించడంలో విఫలమైన డిస్కంలను దివాలా తీసినట్టు ప్రకటించి, వాటి ఆస్తుల వేలం ద్వారా తమ బకాయిలు ఇప్పించాలంటూ.. బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)ని కోరేందుకు వీలు కలుగనుంది. నిజానికి ప్రభుత్వ రంగ డిస్కంలు విద్యుత్ చట్టం పరిధిలోకి వస్తాయని, వాటికి ‘దివాలా స్మృతి’వర్తించదని రాష్ట్రాలు వాదిస్తూ వచ్చాయి.
బకాయిలు కట్టని డిస్కంలపై విద్యుత్ చట్టం కింద బ్యాంకులు, విద్యుదుత్పత్తి సంస్థలు చర్యలు తీసుకునేవి. జరిమానాలతో బకాయిలు వసూలు చేసేందుకు ప్రయత్నించేవి. కానీ ఇకపై డిస్కంలకు గడ్డుకాలమేనని నిపుణులు చెప్తున్నారు.
రుణాలు, బకాయిల భారంతో..
దేశవ్యాప్తంగా ఉన్న డిస్కంలు రూ.వేల కోట్ల అప్పులు, బకాయిల్లో కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు ధరల్లో పెరుగుదలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపు లేకపోవడం, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు వందలకోట్ల మేర పేరుకుపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరిపడా విద్యుత్ సబ్సిడీలు అందకపోవడం వంటి కారణాలతో డిస్కంలు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాయి. విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి డిస్కంలు కొనే విద్యుత్‌కు 45 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. కానీ నిధుల్లేక నెలలు, ఏళ్ల తరబడిగా కట్టలేకపోతున్నాయి.
►కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారమే.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ/ప్రైవేటు రంగ విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.98,518 కోట్ల వరకు ఉన్నాయి. ఇందులో తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.7,888 కోట్లు. వీటితోపాటు తెలంగాణ జెన్‌కో, సింగరేణి థర్మల్ ప్లాంట్లకు చెల్లించాల్సిన సొమ్ము కూడా కలిపితే.. తెలంగాణ డిస్కంల బకాయిలు రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు డిస్కంలు రూ.36 వేల కోట్ల మేర అప్పులు చేశాయి.
►డిస్కంల నుంచి సకాలంలో చెల్లింపులు రాక విద్యుదుత్పత్తి కంపెనీలు బొగ్గు కొనుగోళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ.. గతంలోనే తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment