సాక్షి, హైదరాబాద్: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) సి.మురళీధర్ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు.
డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్‌సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్‌కూ నష్టం జరిగిందని చెప్పారు.
పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment