Preliminary assessment
-
ఇసుక పక్కకు జరగడం వల్లే..
సాక్షి, హైదరాబాద్: ఫౌండేషన్ కింద ఇసుక పక్కకు జరగడంతోనే ఖాళీ ఏర్పడి మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిందని, పైనుంచి చూడడం ద్వారా ఈ మేరకు ప్రాథమిక అంచనాకు వచ్చామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ తెలిపారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత కిందికి దిగి ఫౌండేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే పూర్తిగా స్పష్టత వస్తుందని అన్నారు. ‘ఎక్కడో చిన్నలోపం జరిగి ఉండొచ్చు. ఇందులో సందేహం లేదు. లేకుంటే ఇలా ఎందుకు జరిగేది? ’అని వ్యాఖ్యానించారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతలో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. డిజైన్లలో లోపంతోనే బ్యారేజీ కుంగిందని వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. గతేడాది జూలైలో 25 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినా బ్యారేజీ తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో ఈఎన్సీ మురళీధర్‌తో సమావేశమై విస్తృతంగా చర్చించింది. అనంతరం మురళీధర్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగడంతో పగుళ్లు వచ్చాయని, ర్యాఫ్ట్కూ నష్టం జరిగిందని చెప్పారు. పూర్తి బాధ్యతతో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. బ్యారేజీలోని నీటి నిల్వలను ఖాళీ చేశామని, ఎగువ నుంచి వచ్చే వరదను దారి మళ్లిస్తామని వివరించారు. నెలాఖరులోగా గోదావరిలో ప్రవాహం తగ్గుతుందని, నవంబర్‌లో పనులు ప్రారంభించి వేసవిలోగా పూర్తి చేస్తామని అన్నారు. నిపుణుల కమిటీతో సమావేశమైనవారిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్ర రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులున్నారు. -
వర్షం నష్టం.. 107కోట్లు
అధికారుల ప్రాథమిక అంచనా 23 మండలాల్లో తీవ్ర ప్రభావం 4,900 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు 87 చెరువులకు గండ్లు.. కొన్నింటికి మరమ్మతు 50 కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్లు గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ.50 కోట్ల నష్టం హన్మకొండ అర్బన్ : కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా రూ.107 కోట్లు నష్టం జరిగింది. 23 మండలాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. 88 గ్రామాల్లో సుమారు లక్ష మందికి పైగా ప్రజలు వర్షాలు, వరదల బారిన పడ్డారు. 4,900 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. 687 ఇళ్లు పాక్షికంగా, 37 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 700 ఇళ్లకు నష్టం జరిగినట్టు అధికారులు లెక్కలు వేశారు. వర్షాలు, వరదల వల్ల 27 పశువులు చనిపోయినట్లు ఇప్పటివరకు సమాచారం అందింది. జిల్లాలో 87 చెరువులకు బుంగలుపడి తెగిపోయాయి. వీటిలో కొన్నింటికి అధికారులు తక్షణ మరమ్మతు పనులు చేయగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో 42 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్లు, 8 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని రోడ్లతో కలిపి నష్టం రూ.50కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటితోపాటు విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ పంటలు అన్నింటికి సంబంధించిన సమాచారం అధికారులు ప్రాథమికంగా సేకరించారు. ఈ మొత్తం లెక్కల ప్రకారం నష్టం రూ.107 కోట్లు ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా పరిస్థితిపై సీఎం ఆరా... జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితులతో పాటు ఏటూరునాగారం గోదావరి ప్రవాహం విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యలు, జరిగిన నష్టం, ఏటూర్‌నాగారం గోదావరి వరద ప్రవాహంపై కలెక్టర్ కరుణ ముఖ్యమంత్రికి వివరించారు. -
త్వరలో కొత్త రేషన్ కార్డులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్త రేషన్ కార్డులకోసం ఏళ్లతరబడి నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. అతి త్వరలో అర్హులందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల వివరాలతో నివేదికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచనప్రాయంగా ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలతో జాబితా తయారు చేసేందుకు ఉపక్రమించారు. ‘సర్వే’ వివరాలే కీలకం.. అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. నిబంధనలు మాత్రం మరింత కఠినతరం చేసింది. గతంలో మాధిరిగా దరఖాస్తుల ప్రక్రియలో కాకుండా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. సర్వే ప్రక్రియలో రేషన్ కార్డు వివరాలను సేకరించనప్పటికీ.. కుటుంబ సభ్యుల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి అంచనాలు వేసేలా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. ఈనెల పదోతేదీనాటితో సర్వేకు సంబంధించి కంప్యూటరీకరణ సైతం పూర్తయింది. దీంతో సర్కారు తాజా నిర్ణయంతో వివరాల సేకరణకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలు పెట్టింది. జిల్లాలో ప్రస్తుతం 10.87 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం చేయని కార్డులను బోగస్‌గా పరిగణిస్తూ వాటిని రద్దు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇవి మిన హాయిస్తే ప్రస్తుతం జిల్లాలో 9.32 లక్షల రేషన్ కార్డులున్నట్లు లెక్క. అర్హుల సంఖ్య పెరిగే అవకాశం... 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 52.93 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఇందులో 12 లక్షల కుటుంబాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 4 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ఆ గణాంకాలు స్పష్టం చేశాయి. అయితే ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో ఈ గణాంకాలకు రెట్టింపు స్థాయిలో కుటుంబాలు ఉన్నట్లు తేలింది. సర్వే వివరాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.4 లక్షల కుటుంబాలున్నాయి. ఈక్రమంలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అర్హుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.