త్వరలో కొత్త రేషన్ కార్డులు | The new ration cards releases soon | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త రేషన్ కార్డులు

Published Mon, Sep 15 2014 10:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

The new ration cards releases soon

 సాక్షి, రంగారెడ్డి జిల్లా:  కొత్త రేషన్ కార్డులకోసం ఏళ్లతరబడి నిరీక్షిస్తున్న వారికి శుభవార్త. అతి త్వరలో అర్హులందరికీ కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల వివరాలతో నివేదికలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచనప్రాయంగా ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలతో జాబితా తయారు చేసేందుకు ఉపక్రమించారు.

 ‘సర్వే’ వివరాలే కీలకం..
 అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. నిబంధనలు మాత్రం మరింత కఠినతరం చేసింది. గతంలో మాధిరిగా దరఖాస్తుల ప్రక్రియలో కాకుండా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. సర్వే ప్రక్రియలో రేషన్ కార్డు వివరాలను సేకరించనప్పటికీ.. కుటుంబ సభ్యుల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి అంచనాలు వేసేలా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. ఈనెల పదోతేదీనాటితో సర్వేకు సంబంధించి కంప్యూటరీకరణ సైతం పూర్తయింది. దీంతో సర్కారు తాజా నిర్ణయంతో వివరాల సేకరణకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలు పెట్టింది. జిల్లాలో ప్రస్తుతం 10.87 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం చేయని కార్డులను బోగస్‌గా పరిగణిస్తూ వాటిని రద్దు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇవి మిన హాయిస్తే ప్రస్తుతం జిల్లాలో 9.32 లక్షల రేషన్ కార్డులున్నట్లు లెక్క.

 అర్హుల సంఖ్య పెరిగే అవకాశం...
 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 52.93 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఇందులో 12 లక్షల కుటుంబాలు ఉండగా.. గ్రామీణ ప్రాంతంలో 4 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ఆ గణాంకాలు స్పష్టం చేశాయి. అయితే ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో ఈ గణాంకాలకు రెట్టింపు స్థాయిలో కుటుంబాలు ఉన్నట్లు తేలింది. సర్వే వివరాల ప్రకారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 8.4 లక్షల కుటుంబాలున్నాయి. ఈక్రమంలో రేషన్ కార్డులు లేని కుటుంబాలు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అర్హుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement