వర్షం నష్టం.. 107కోట్లు
-
అధికారుల ప్రాథమిక అంచనా
-
23 మండలాల్లో తీవ్ర ప్రభావం
-
4,900 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
-
87 చెరువులకు గండ్లు.. కొన్నింటికి మరమ్మతు
-
50 కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్లు
-
గ్రేటర్ వరంగల్ పరిధిలో రూ.50 కోట్ల నష్టం
హన్మకొండ అర్బన్ :
కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా రూ.107 కోట్లు నష్టం జరిగింది. 23 మండలాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. 88 గ్రామాల్లో సుమారు లక్ష మందికి పైగా ప్రజలు వర్షాలు, వరదల బారిన పడ్డారు. 4,900 హెక్టార్లలో వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. 687 ఇళ్లు పాక్షికంగా, 37 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 700 ఇళ్లకు నష్టం జరిగినట్టు అధికారులు లెక్కలు వేశారు. వర్షాలు, వరదల వల్ల 27 పశువులు చనిపోయినట్లు ఇప్పటివరకు సమాచారం అందింది. జిల్లాలో 87 చెరువులకు బుంగలుపడి తెగిపోయాయి. వీటిలో కొన్నింటికి అధికారులు తక్షణ మరమ్మతు పనులు చేయగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో 42 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు, 8 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని రోడ్లతో కలిపి నష్టం రూ.50కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటితోపాటు విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ పంటలు అన్నింటికి సంబంధించిన సమాచారం అధికారులు ప్రాథమికంగా సేకరించారు. ఈ మొత్తం లెక్కల ప్రకారం నష్టం రూ.107 కోట్లు ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు.
జిల్లా పరిస్థితిపై సీఎం ఆరా...
జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితులతో పాటు ఏటూరునాగారం గోదావరి ప్రవాహం విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యలు, జరిగిన నష్టం, ఏటూర్‌నాగారం గోదావరి వరద ప్రవాహంపై కలెక్టర్ కరుణ ముఖ్యమంత్రికి వివరించారు.