సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో పరీక్షల విధానాన్ని, మూల్యాంకన పద్ధతిని సమూలంగా మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ దిశగా అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం జరిగే సమావేశం కీలకమైందిగా అధికారులు చెబుతున్నారు.
కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు ఈ భేటీకి హాజరవుతున్నారు. మరో ఆరు ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌ను సమావేశానికి ఆహ్వానించారు. విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటి వరకూ జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన డేటాను ఐఎస్‌బీకి అందజేయబోతున్నారు.
ఈ సమావేశం అనంతరం ఐఎస్‌బీ బృందాలు దాదాపు వంద కాలేజీల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న పరీక్షల విధానంపై స్టడీ చేస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన సరికొత్త పరీక్షల ప్రక్రియపై ఐఎస్‌బీ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలులోకి తెస్తామని ఉన్నత విద్య మండలి తెలిపింది.
విభిన్న తరహా విశ్లేషణ
డిగ్రీ, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య పరిధిలోని అన్ని కోర్సుల్లో పరీక్షల విధానం ఎలా ఉంది? మార్కులు వేసే పద్ధతి ఏంటి? ఏ తరహా విద్యార్థికి ఎన్ని మార్కులొస్తున్నాయి? ఉన్నత విద్య తర్వాత విద్యార్థికి లభించే ఉపాధి ఏమిటి? అసలు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు? పరీక్షలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ తరహా డేటాను పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటికే సేకరించారు.
వీటినే ఐఎస్‌బీ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉన్నత విద్యలో అత్యధిక మార్కులు పొందినప్పటికీ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వారిలో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. కేవలం మార్కుల కోణంలోనే మూల్యాంకన విధానం ఉందని, విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే తరహా అవసరమని భావించింది.
వేగంగా విస్తరిస్తున్న బహుళజాతి సంస్థల్లో చేరేందుకు ఈ విధానం అవరోధంగా ఉందని గుర్తించారు. డిగ్రీ చేతికొచ్చిన విద్యార్థి ఉద్యోగ వేటలో ఎదురయ్యే పరీక్షల తంతును అందిపుచ్చుకునే తరహాలో శిక్షణ, పరీక్షలు, బోధన విధానం ఉండాలన్నదే సంస్కరణల ప్రధానోద్దేశ్యమని మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ కోణంలోనే ఐఎస్‌బీ చేత అధ్యయనం చేయిస్తున్నట్టు చెప్పారు. ఇది అత్యంత సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని ఐఎస్‌బీ నిపుణుడు శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment