సాక్షి, హైదరాబాద్: వదలని వాన వణికిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా నమోదవుతున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతుండగా.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది.
అత్యధికంగా మెదక్ జిల్లాలో 16.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో శనివా రం వరకు రాష్ట్రంలో 30.46 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెట్టింపునకు పైగా 63.66 సెంటీమీ టర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలి పింది. సాధారణ వర్షపాతం కంటే 109% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
కొనసాగుతున్న ఉపరితలద్రోణి
రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసా గుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసా గుతోంది. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరి తల అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రబావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
నిరంతరం అప్రమత్తం: సీఎస్
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివా రం ఆయన విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జతో కలసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరసగా వస్తున్న రెండురోజుల సెలవులను ఉపయో గించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు.
రెడ్ అలర్ట్ జిల్లాలు:
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు:
నల్లగొండ, జనగామ, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment