ఇది నకిలీ ‘టీఎస్‌–బీపాస్‌’ | Fake portal targeting home permit applicants | Sakshi
Sakshi News home page

ఇది నకిలీ ‘టీఎస్‌–బీపాస్‌’

Published Mon, Jan 18 2021 5:34 AM | Last Updated on Mon, Jan 18 2021 5:34 AM

Fake portal targeting home permit applicants - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవనాలు, లేఅవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ (https:// tsbpass. tela ngana.gov.in)ను పోలినట్లుగా ఓ నకిలీ పోర్టల్‌ పుట్టుకొచ్చింది. గూగుల్‌లో ‘టీఎస్‌బీపాస్‌’అని సెర్చ్‌ చేస్తే ఒరిజినల్‌ పోర్టల్‌ కిందనే నకిలీ పోర్టల్‌  (http://10061994. xyz/ tsbpass2/ index. html) సైతం కనపడుతోంది. దరఖాస్తుదారులను మోసగించి వారికి సంబంధించిన పేటీఎం, ఫోన్‌పే, డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించి బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టడానికి సైబర్‌ నేరగాళ్లు ఈ పోర్టల్‌ను తయారు చేశారు. అసలు పోర్టల్‌ హోం పేజీని పోలిన విధంగా నకిలీ హోం పేజీని డిజైన్‌ చేశారు. ‘తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం’పేరు, తెలంగాణ రాష్ట్ర అధికారిక లోగో ఇందులోనూ ఉండటంతో ప్రజలు సులువుగా మోసపోవడానికి అవకాశాలున్నాయి.

ఒరిజినల్‌ పోర్టల్‌ తరహాలోనే నకిలీ దాంట్లోనూ ‘పర్సనల్‌ ఇన్ఫర్మేషన్, బిల్డింగ్‌ డిటైల్స్, పేమెంట్, ఫినిష్‌’పేర్లతో నాలుగు అంచెల్లో దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పేమెంట్‌ ఆప్షన్‌లో పేటీఎం, ఫోన్‌పే, డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫీజులు చెల్లించే అవకాశం ఉన్నట్లు చూపుతోంది. ఆన్‌లైన్‌లో టీఎస్‌–బీపాస్‌ పోర్టల్‌ను సెర్చ్‌ చేసే క్రమంలో ‘సాక్షి’ప్రతినిధి ఈ అనుమానాస్పద వెబ్‌సైట్‌ను గుర్తించి రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. ఆయన ఆ పోర్టల్‌ను పరిశీలించి నకిలీగా నిర్ధారించారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు గూగుల్‌కు సమాచారం ఇచ్చి బ్లాక్‌ చేయిస్తామని ‘సాక్షి’కి తెలిపారు. 

గతంలో సైతం ఇలాంటి ఘటనలు.. 
సైబర్‌ క్రైం భాషలో ఏదైనా అసలు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టిస్తే దాన్ని స్ఫూఫింగ్‌ వెబ్‌సైట్‌ (Spoofing) అంటారు. గతంలో ప్రముఖ బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లను సైబర్‌ నేరస్తులు సృష్టించి అమాయక ప్రజల నుంచి ఫీజుల పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేయడంతోపాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. ఇలా సున్నితమైన సమాచారాన్ని తస్కరించడాన్ని ఫిషింగ్‌ ( Phishing) అటాక్‌ అంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement