ఒకప్పుడు కరువు విలయ తాండవం చేసిన గడ్డపైనే.. సాహిత్యం అలరారింది. పనితోనే పాట పుట్టిందని.. పాటే ‘పనీపాట’ అయిందని ఎందరో కవులు చాటి చెప్పారు. జానపదం, యక్షగానం, వీధినాటకం, కాళ్లగజ్జల దరువులో ఓలలాడింది.. రేలా ధూలాకు ఎగిరి గంతులేసింది.. మద్దెల మోతల జడకొప్పులు జానపదానికి కొత్త అందం తెచ్చిపెట్టాయి.
దొరలు, భూస్వాముల అన్యాయాలను ప్రశ్నిస్తూ.. పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ‘పల్లె కన్నీరు పెడుతుందో..’నంటూ ప్రజలను ఆలోచింపజేస్తూ.. ‘గౌలిగూడ గల్లీకాడ గోల చేసినా..’ అంటూ యువతను ఉర్రూతలూగిస్తూ ఎన్నో పాటలు ఇక్కడి కవుల నుంచి జాలువారాయి. మొత్తంగా మట్టి కవులకు పుట్టినిల్లు గా నిలిచింది పాలమూరు జిల్లా.
మదనాపురం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ కళా రూపాల్లో రాణించిన కళాకారులందరూ మట్టిలోని పరిమళాలే. గ్రామీణ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అవార్డులు సినీ పరిశ్రమలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళారూపాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు పాలమూరు కళాకారులు. గోరటి వెంకన్న, బెల్లం సాయిలు, జంగారెడ్డి, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిచంద్, భీంపల్లి శ్రీకాంత్, శివనాగులు శివలింగం లాంటి ఎందరో కవులు సాహితీ ఔనత్యాన్ని ప్రభవించారు. ఇక్కడి కవులు రాసిన పాటలు, యక్షగానాలు, జడకొప్పులాట, తంబూరా లాంటి పాటలు నేటికీ తెలుగు ప్రజల మనసు చూరగొన్నాయి.
కవిత సంపుటిలో ‘కోట్ల’ మైలురాయి
గుండె కింద తడి.. రంగు వెలిసిన జెండా.. రహస్యాలు లేని వాళ్లు.. నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత తెలుగు, ఆంగ్ల భాషల్లో).. నూరు తెలంగాణ నానీలు.. మనిషెళ్లిపోతుండు (పాలమూరు వలసలపై కవిత్వం) వంటి అనేక రచనలు కోట్ల వెంకటేశ్వరరెడ్డి నుంచి జాలువారాయి. 2019లో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డుతో సత్కరించగా.. దాదాపు 50అవార్డులు అందుకున్నారు. తన రచనలు ప్రజలకు ఎంతో దోహదపడాలనీ కోరుకుంటున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
జానపదాల ‘బెల్లం సాయిలు’
ఐదు దశాబ్దాల క్రితమే పాలమూరులో జానపదానికి విత్తనాలు నాటిన కవి బెల్లం సాయిలు. ఆయన రాసిన ‘మరదల పోదామా మన్యంకొండకు’.. పొద్దంతా పోయింది ఎంకి పాట, సాంఘి క నాటకాలతో ప్రజ ల అభిమానాలు పొందాడు. అనేక రచనలు, వందల సంఖ్యలో అవార్డులు ఆయన సొంతం. కురుమూర్తిక్షేత్రంపై ఆయన చేసిన పరిశోధన చెరగని ముద్ర. గాయకుడిగా, నటుడిగా విభిన్న పాత్రలు పోషించిన ఆయనతాను బతికున్నంత కాలం పాలమూరు బిడ్డలకు జానపదాలు అంకితం చేస్తానంటున్నాడు.
ఉద్యమానికి ఊపిరిపోసిన ‘గోరటి’
తెలంగాణ మలిదశ ఉద్యమంలో గోరటి వెంకన్న పాట తెలంగాణ ప్రజలను నిద్ర లేపింది. ఉద్యమానికి ఊపిరి పోసింది. యక్షగానం, విప్లవ సాహిత్య రచనల్లో ఆయన మణిహారాల పుట్ట. పాలమూరు మట్టిలో పుట్టిన పరిమళం. ఆయన చేతి నుంచి జాలువారిని పల్లె కన్నీరు పెడుతుందన్న జానపదం జనాలను ఆలోచింపజేసింది. 5 వేల పాటలు, 150 అవార్డులు, 50 రచనలు ఆయన సొంతం. పాటే నాకు జీవితమని.. పేర్కొంటూ తనను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
పాటలతో ఉర్రూతలూగించే ‘ఎద్దుల జంగిరెడ్డి’
ఆయన పాట పాడితే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయనే ఎద్దుల జంగిరెడ్డి. రెండు దశాబ్దాల క్రితం ‘గౌలిగూడ గల్లీ కాడ గోల చేసినా..’ అనే జానపదంతో యువతను ఉర్రూతలుగించాడు. ఎంకి పాటలు అంటే ఆయన సొంతం. పాలమూరు జిల్లాతోపాటు అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ దేశాల్లో జానపద ప్రదర్శనలిచ్చి అవార్డులు అందుకున్నారు. వెయ్యి పాటలు, 500 రచనలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తాను పాట కోసమే బతుకుతున్నానని చెబుతున్నాడు.
మధురం.. ‘రోజారమణి’ గాత్రం
‘నిమ్మ లోగొట్టే రో రఘువోనంద.. ’ అనే జానపదం, మధురమైన గానంతో కోట్లాది మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది గాయకురాలు రోజారమణి. తాను పాడిన పాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఓ ప్రముఖ టీవీ చానల్‌లోని రేలా రే రేలా కార్యక్రమంతో ప్రారంభించిన పాటల సందడి ఇప్పటికీ 200 పాటలు పాడి యూట్యూబ్‌లో తనదైన ముద్ర వేసుకుంది. కొత్తకొత్త పాటలతో ప్రజల ముందు కొస్తానని తెలిపాడు.
పల్లెటూరి పాటగాడు ‘శివలింగం’
పల్లెటూరి పాటలు వినాలంటే శివలింగం నోటనే వినాలి. భిన్నమైన గొంతు.. ఆకట్టుకునే రకం ఆయన నైజం. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ గాయకుడిగా రెండు సార్లు అవార్డు, నగదు అందుకున్నాడు. మారుమూలపల్లెలో పుట్టి పల్లె పాటల పురుడు పోసుకున్న శివలింగాన్ని జిల్లా ప్రజలు మరిచిపోరు.
కవిత పరిశోధనలో దిట్ట ‘భీంపల్లి’
పాలమూరు సాహితి అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.. అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పీహెచ్‌డీ పరిశోధన చేశారు. జిల్లా కల్చరల్ అకాడమీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో 50కి పైగా పత్ర సమర్పణలు చేశారు. 40కి పైగా అవార్డులు అందుకొని.. కవిగా, కథకుడిగా,పరిశోధకుడిగా,విమర్శకుడిగా పేరుగాంచారు. సాహితీ కార్యక్రమాలకు క్రియాశీలక కార్యకర్త. పత్రికల్లో కవితలు, గేయాలు, వ్యాసాలు, కథలు, సమీక్షలు ఆయన సొంతం.
పౌరాణికంలో రారాజు ‘కోట్ల వేమారెడ్డి’
జాతీయ స్థాయిలో పౌరాణికంలో అవార్డులు అందుకున్న ఘనత కోట్ల వేమారెడ్డిది. 300పైగా ప్రదర్శనలు, 200 పైగా అవార్డులు ఆయన సొంతం. తొమ్మిది పర్యాయాలు జాతీయస్థాయి అవార్డులు అందుకొని, తాను పుట్టిన ఊరిలో వ్యవసాయం చేస్తూ అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని నేటి యువతకు అందిస్తానని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment