
రైతులకు నచ్చజెపుతున్న అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
ధర్మసాగర్/చిల్పూరు: ‘పేదల భూములు లాక్కొ ని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో డబ్బులు సంపాదించాలనే సర్కారు నిర్ణయం సరికాదు. అంత అవసరమైతే రైతులందరం భిక్షం ఎత్తుకొని డబ్బు ల పోగు చేసి ప్రభుత్వానికి ఇస్తాం. అంతేకానీ మా పచ్చని భూములు ఇవ్వం’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నగరం చుట్టూ 27 గ్రామాల్లో దాదాపు 22 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
వరంగల్ నగరం చుట్టూ చేపడుతున్న రింగ్ రోడ్డు, ఇతర అవసరాలకు భూమి సేకరించేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ జీవో 80–ఏకు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం వద్ద హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆందోళనకు సిద్ధపడ్డారు. వీరి ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయి.
పోలీసుల కళ్లు గప్పి..
రైతుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా వందలాది మంది రైతులు పోలీసుల కళ్లు గప్పి జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
జనగామ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా రైతులు నాయకులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే సపర్యలు చేయడంతో తేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment