Poor lands
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు : సుప్రీం గ్రీన్ సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 👉 ఈ క్రమంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 👉 విచారణ సమయంలో.. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించాం. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. సి ఆర్ డి ఎ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు అని వాదించారు. అలాగే.. ఆర్ - 5 జోన్ లో పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ అధికారం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ - సిటీ కి ఇబ్బంది ఎలా కలుగుతుందని వాదించారు. 👉 మరోవైపు సీఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవని, చట్టం ప్రకారమే 5 శాతం ఈ డబ్లు ఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వమే భూ సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏపీ ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
పచ్చని భూములు ఇవ్వం!
ధర్మసాగర్/చిల్పూరు: ‘పేదల భూములు లాక్కొ ని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో డబ్బులు సంపాదించాలనే సర్కారు నిర్ణయం సరికాదు. అంత అవసరమైతే రైతులందరం భిక్షం ఎత్తుకొని డబ్బు ల పోగు చేసి ప్రభుత్వానికి ఇస్తాం. అంతేకానీ మా పచ్చని భూములు ఇవ్వం’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నగరం చుట్టూ 27 గ్రామాల్లో దాదాపు 22 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వరంగల్ నగరం చుట్టూ చేపడుతున్న రింగ్ రోడ్డు, ఇతర అవసరాలకు భూమి సేకరించేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ జీవో 80–ఏకు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం వద్ద హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆందోళనకు సిద్ధపడ్డారు. వీరి ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపాయి. పోలీసుల కళ్లు గప్పి.. రైతుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా వందలాది మంది రైతులు పోలీసుల కళ్లు గప్పి జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. దాదాపు 4 గంటల పాటు రహదారిని రైతులు దిగ్బంధం చేశారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా రైతులు నాయకులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన రైతులు ఆందోళన విరమించారు. ఆందోళనలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే సపర్యలు చేయడంతో తేరుకున్నారు. -
రాజుగారి అడ్డ‘దారి’
గ్రానైట్ రవాణా కోసం పేదల భూముల పణం 30 ఏళ్లుగా జీడితోటలు సాగుచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పట్టాల పంపిణీ అయినా ఆన్లైన్లో భూముల నమోదుకు మోకాలడ్డు ఈ-పట్టాలివ్వొద్దంటూ అధికారులకు హుకుం ఆందోళన చెందుతున్న బాధిత రైతులు...ఆక్రమించుకునే ఎత్తుగడేనంటూ ఆవేదన అదో పెద్ద కొండ.. దాని నిండా అపారమైన గ్రానైట్ నిక్షేపాలు.. వాటిని తవ్విపోయడానికి ‘స్థానిక రాజు’గారితో సహా పలువురికి క్వారీ లీజులు.. కానీ కొండపైకి వెళ్లడానికి.. తవ్విన నిక్షేపాల రవాణాకు దారే లేదు.. కారణం.. కొండ దిగువన వందల ఎకరాల్లో సాగు భూములు ఉండటమే.. అవన్నీ ఎస్సీ, ఎస్టీ రైతుల అనుభవంలో ఉన్నవే.. మామూలుగా అడిగితే వాళ్లు ఇవ్వరు.. అందకని రాజుగారో పాచిక వేశారు.. తన క్వారీలకు దారి కోసం అడ్డదారి తొక్కారు.. దివంగత నేత వైఎస్ జమానాలో రైతులకు పట్టాలిచ్చినా.. వాటిని ఆన్లైన్లో నమోదు చేయకుండా తొక్కిపెడుతున్నారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకోవాలని.. వారంతట వారే భూములను తనకు ఇచ్చేసేలా మంత్రాంగం నెరుపుతున్నారు. ఇప్పటికే కొండకు మరోవైపున్న కొంత భూమిని చెరబట్టిన రాజుగారు.. ఇప్పుడు రైతుల భూమిపై కన్నేయడంతో వారంతా కలవరపడుతున్నారు. విశాఖపట్నం: గ్రానైట్ నిక్షేపాల కోసం కొందరు పెద్దలు నిరుపేదల పొట్టకొడుతున్నారు. మహానేత వారికిచ్చిన భూములను కాజేయాలని చూస్తున్నారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా ఆ భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయకుండా మోకాలడ్డుతూ పేద రైతులకు సర్కారు నుంచి రుణాలు, ఇతరత్రా సాయం అందకుండా చేస్తున్నారు. మాడుగుల మండలం విజేపురం రెవెన్యూ పంచాయతీ పరిధి సర్వే నెం.2 పరిధిలో ఉన్న కొండ ప్రాంతానికి చెందిన 373.32 ఎకరాల భూముల్లో కోమరి, మత్స్యపురం, విజేపురం, కొవ్వుగుంట, బుడ్డిబంద గ్రామాలకు చెందిన నిరుపేదలు సుమారు 30 ఏళ్లుగా జీడితోటలు సాగు చేసుకుంటున్నారు. సుమారు రెండు దశాబ్దాలకు ఆ భూములకు పట్టాలివ్వాలని పోరాటలు చేసినా నాటి టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. చివరికి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006లో చేపట్టిన ఇందిరమ్మ భూ పంపిణీలో వీరి ఆశలు ఫలించాయి. 70 మంది ఎస్టీలకు 170.58 ఎకరాలు, 41మంది ఎస్సీలకు 57.23 ఎకరాలు, 27 మంది బీసీలకు 43.31ఎకరాలు, 33 మంది ఇతరులకు 61 ఎకరాలు చొప్పున మొత్తం 203 మందికి 372.25 ఎకరాల భూములను కేటాయించారు. ఐదు, ఆరు విడతల్లో జరిగిన భూ పంపిణీలో డీ.ఫారం పట్టాలు, టైటిల్ డీడ్లు కూడా ఇచ్చారు. కాగా 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల నమోదుకు సంబంధించి వెబ్‌ల్యాండ్ ఆన్లైన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఆ మేరకు తమ భూములను తమ పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. గ్రానైట్ నిక్షేపాల కోసమే.. కొండ దిగువ భాగంలో వీరు సాగు చేసుకుంటుండగా..పై భాగంలో కోట్ల విలువైన గ్రానైట్ నిక్షేపాలున్నాయి. ఉర్వోవ కొండ తో పాటు పరిసర కొండల్లో ఉన్న గ్రానైట్ నిక్షేపాల వెలికితీతకు 50 మందికి పైగా లీజులు పొందారు. ఎమ్మెల్యే కూడా ఓ కొండను లీజుకు తీసుకున్నారు. కాగా రైతులు సాగు చేసుకుంటున్న ఉర్వోవ కొండపై భాగంలో కూడా సుమారు 3వేల హెక్టార్లలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటిలో ఇప్పటికే 150 హెక్టార్లలో కొండ ప్రాంతంలో గ్రానైట్ నిక్షేపాల వెలికితీత కోసం 10 క్వారీలకు అనుమతులిచ్చారు. మిగిలిన 2,850 హెక్టార్లలో లీజుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే బంధువులు, స్నేహితులు కలిసి సుమారు 110 మంది ఈ లీజుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రానైట్ నిక్షేపాల వెలికితీత కు కిందనున్న పట్టా భూములే అడ్డంకిగా ఉన్నాయి. ఇప్పటికే పైన లీజుకు తీసుకున్న లీజుదారులు సుమారు 15 ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. మిగిలిన భూములకు పట్టాలిచ్చి పూర్తి హక్కులు కల్పిస్తే పైనున్న గ్రానైట్‌ను తవ్వినా తరలించడానికి అడ్డంకిగా మారతాయి. ఈ కారణంగానే వీరి భూములను ఆన్లైన్లో పొందుపర్చకుండా.. పట్టాలివ్వకుండా మోకాలడ్డుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే జరుగుతోందని.. అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఏదో విధంగా కాజేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో చేర్చకపోవడం వల్ల ఈ భూములకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులు, పురుగుల మందులే కాదు.. రుణాలు కూడా అందడం లేదు. 1-బీ అడంగల్, ఆన్లైన్లో నమోదైతేనే ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అనేకమార్లు ‘మీ ఇంటికి మీ భూమికి’ కింద దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ కారణంగానే హుద్‌హుద్ సమయంలో పెద్ద ఎత్తున జీడితోటలు నేలకొరిగినా ఏ ఒక్కరికి కనీసం పైసా కూడా పరిహారం దక్కలేదు. ఇప్పటికైనా తమ భూములను వెబ్‌ల్యాండ్‌లో చేర్చి. ఈ పట్టాలు జారీ చేయాలని.. భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా మా భూములను లాక్కోవాలని చూస్తే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. -
పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ?
రైతు కూలీ సంఘం నాయకులు విజయనగరం కంటోన్మెంట్ : భూస్వాములు కబ్జా చేసిన చెరువులను వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో (నీరు లేనివి) ‘నీరు-చెట్టు’ పనులు ఎలా చేపడతారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలగాడ కృష్ణ, పి. మల్లిక్, ప్రగతి శీల మహిళా సంఘ జిల్లా కన్వీనర్ పి. రమణి, తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు గర్భాల్లో సాగు చేసుకుంటున్న దళితులకు భవిష్యత్‌లో ప్రభుత్వం సాగు హక్కు కల్పించే అవకాశం ఉందన్నారు. వారి పొట్టకొట్టడానికే ప్రభుత్వం ‘నీరు-చెట్టు’లో భాగంగా జేసీబీతో పనులు చేపడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులకు లాభం చేకూరేలా ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై పేదలు సాగు చేస్తున్న చెరువుల్లోనే పనులు చేపట్టడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. -
58 జీవోపై కబ్జా కన్ను
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రహసనంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్కారు భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో నంబర్ 58 ప్రకారం పేదల భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. ఈ క్రమబద్ధీకరణ కోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకోగా... ఇందులో అర్హులను గుర్తించ డం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. జిల్లాలోని కొన్నిచోట్ల ఏకంగా శిఖం భూములు, ఎన్ఎస్పీ భూములు, వక్ఫ్ భూములను సైతం ఆక్రమించి నివాసయోగ్యంగా మలుచుకున్నారు. వాటిని క్రమబద్ధీకరించమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో అర్థంకాక అధికారులు తల పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకుని నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేదలకు 58 జీవో ప్రకారం ఉచితంగా, 59 జీవో ప్రకారం 250 గజాల భూమికి మార్కెట్ ధర ప్రకారం రుసుం చెల్లిస్తే రెగ్యులరైజేషన్ చేస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 58 జీవో కింద 125 గజాల స్థలం కోసం 23,023 మంది దరఖాస్తులు సమర్పించారు. వీటిలో 1804 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించినట్లు తెలుస్తోంది. 1212 దరఖాస్తులను స్కెచ్ అప్లోడ్, 1258 ఫొటోలతో అప్లోడ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 23,023 దరఖాస్తుల్లో 1804 పోగా మిగిలిన దరఖాస్తులపై మళ్లీ అధికార యంత్రాంగం రీ సర్వే చేయనున్నట్లు సమాచారం. సర్వే అనంతరం ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. అభ్యంతరాలే అధికం జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో పభుత్వ నిబంధనల ప్రకారం సగానికి పైగా అభ్యంతరకరమైనవే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 58 ప్రకారం 125 గజాల నివాసస్థలాన్ని ఉచితం గా క్రమబద్ధీకరించాలి. అయితే ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా అసైన్డ్, ఎన్నె స్పీ, శిఖం, కుంట భూములు ఉండటంతో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం ఫలానా భూములను క్రమబద్ధీకరించాలని స్పష్టంగా చెప్పకపోవడంతో ఏమి చేయా లో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు. ఆక్రమణల పర్వం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలు 58, 59ని వ్యాపారులు, బడాబాబులు అనుకూలంగా మ లుచుకుంటున్నారు. ఆక్రమణల పర్వానికి తెరలేపారు. రాజకీయ నేతల అనుచరులు కొంద రు, సన్నిహితులు ఇదే పనిగా పావులు కదుపుతున్నారు. ఖమ్మంలో ప్రభుత్వ స్థలాలపై పట్టు న్న మాజీ ఉద్యోగులు, ఇతర మధ్యవర్తులు పేద ల ముసుగులో భూములను కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అండను అడ్డుపెట్టుకొని ఆక్రమిత స్థలాలను కాజేయూలనే లక్ష్యంతో ఫెన్సింగ్ సైతం వేసినట్లు తెలుస్తోంది. ఆర్డీవోలే కీలకం క్రమబద్ధీకరణలో బృందాల పరిశీలన, ఫొటో ఆప్‌లోడ్ పక్రియ ముగిసిన తరువాత ఆర్డీవోలదే తుది నిర్ణయం. ఆయా బృందాలు అర్హులని తేల్చిన దరఖాస్తులను ఉన్నతాధికారులు మరోమారు పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆయా మండలాల్లో ఇప్పటికే సర్వే పూర్తరుుంది. అప్లోడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం కోసం... క్రమబద్ధీకరణ పక్రియ చివరిదశకు చేరుకుంది. రెండు నెలలుగా అధికార యంత్రాంగం అన్ని ప నులకు స్వస్తి చెప్పి దీనిపైనే కుస్తి పట్టింది. వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందాలు చివరకు అర్హులను తేల్చాయి. మిగి లిన దరఖాస్తులపై మారో మారు పరిశీలన జరుగుతుందంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడిన వెంటనే అర్హులకు పట్టాలు అందించేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. -
పేదల భూముల జోలికొస్తే ఊరుకోం
* అధికారుల బెదిరింపులకు భయపడం * సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముదిగేడు(పొదలకూరు) : పొదలకూరు మండలంలోని ముదిగేడులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూముల జోలికి అధకారులొస్తే ఊరుకునేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పేదల భూములను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. మండలంలోని ముదిగేడు గ్రామం కండేలేరు ఏటిగట్టున ఉన్న శివాలయం వద్ద పెదమల్లు శ్రీనివాసులురెడ్డి ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాము సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడం వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నట్టు తెలిపారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పేదరైతులకు అండగా ఉంటామన్నారు. మండలంలో పింఛన్లను సైతం ఇష్టానుసారంగా తొలగించారన్నారు. అర్హులను సైతం పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పింఛన్ల జాబితాపై మండల కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్తీక మాసంలో మహిళలు చేసిన పూజలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వేపల్లి నియోజవర్గంలో పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. శివపార్వతుల కరుణాకటాక్షలు నవ్యాంధ్రప్రదేశ్‌పై పడి సకాలంలో వర్షాలు కురిసి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఎమ్మెల్యే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామరైతులు సాగునీటి ఇబ్బందులు, పింఛన్ల తొలగింపు తదితర సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, మండి శ్రీనివాసులురెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, యాతం పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.