పేదల భూముల జోలికొస్తే ఊరుకోం
* అధికారుల బెదిరింపులకు భయపడం
* సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముదిగేడు(పొదలకూరు) : పొదలకూరు మండలంలోని ముదిగేడులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూముల జోలికి అధకారులొస్తే ఊరుకునేది లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పేదల భూములను స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. మండలంలోని ముదిగేడు గ్రామం కండేలేరు ఏటిగట్టున ఉన్న శివాలయం వద్ద పెదమల్లు శ్రీనివాసులురెడ్డి ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు తాము సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడం వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నట్టు తెలిపారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పేదరైతులకు అండగా ఉంటామన్నారు. మండలంలో పింఛన్లను సైతం ఇష్టానుసారంగా తొలగించారన్నారు.
అర్హులను సైతం పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం పింఛన్ల జాబితాపై మండల కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్తీక మాసంలో మహిళలు చేసిన పూజలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సర్వేపల్లి నియోజవర్గంలో పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. శివపార్వతుల కరుణాకటాక్షలు నవ్యాంధ్రప్రదేశ్‌పై పడి సకాలంలో వర్షాలు కురిసి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఎమ్మెల్యే శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గ్రామరైతులు సాగునీటి ఇబ్బందులు, పింఛన్ల తొలగింపు తదితర సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లను అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, మండి శ్రీనివాసులురెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, యాతం పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.