
సాక్షి, ఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్‌లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
👉 ఈ క్రమంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
👉 విచారణ సమయంలో.. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించాం. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. సి ఆర్ డి ఎ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు అని వాదించారు. అలాగే.. ఆర్ - 5 జోన్ లో పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ అధికారం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ - సిటీ కి ఇబ్బంది ఎలా కలుగుతుందని వాదించారు.
👉 మరోవైపు సీఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవని, చట్టం ప్రకారమే 5 శాతం ఈ డబ్లు ఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వమే భూ సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఏపీ ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
Comments
Please login to add a commentAdd a comment