
అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకునే టీడీపీ యత్నానికి..
సాక్షి, ఢిల్లీ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేదలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకునే టీడీపీ యత్నానికి కోర్టులో బ్రేకు పడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు సానుకూలత ప్రదర్శించింది. ‘మీ 35 సెంట్ల భూమి నుంచి పేదలకు స్థలం ఇస్తున్నారా?. 75 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి?’ అంటూ పిటిషనర్‌పై సుప్రీం కోర్టు సీరియస్ అయినట్లు సమాచారం.
అలాగే.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారణకు నిరాకరించింది సుప్రీం. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు టీడీపీ సానుభూతిపరుడు శివ.
అమరావతి రాజధాని ప్రాంతాల్లో వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ఈ ప్రయత్నాలను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అమరావతిలో పేదలకు స్థానం లేదని కోర్టుల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వాలన్న జీవో పై స్టే ఇవ్వాలని అడిగారు. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని సుప్రీం కోర్టు అడిగింది. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పేదలకు సెంట్ భూమి ఇస్తే ఎందుకు కడుపు మంట. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, గత్యంతరం లేక పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం పేదలకు 5శాతం ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తుంది అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు.
చట్టం ప్రకారం పేదలకు అయిదు శాతం ఇవ్వాల్సిందే. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 45 ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ సవరణ చేసి ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే వీటిని ఇచ్చారు అని ఏపీ ప్రభుత్వ స్పెషల్ జీపీ కాసా జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
అమరావతి కేసులో మంచి నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. వైఎస్ జగన్ పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు సఫలపవుతయి అని అడ్వకేట్ జానకీ రామయ్య పేర్కొన్నారు.