రాజుగారి అడ్డ‘దారి’
గ్రానైట్ రవాణా కోసం పేదల భూముల పణం
30 ఏళ్లుగా జీడితోటలు సాగుచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పట్టాల పంపిణీ
అయినా ఆన్‌లైన్‌లో భూముల నమోదుకు మోకాలడ్డు
ఈ-పట్టాలివ్వొద్దంటూ అధికారులకు హుకుం
ఆందోళన చెందుతున్న బాధిత రైతులు...ఆక్రమించుకునే ఎత్తుగడేనంటూ ఆవేదన
అదో పెద్ద కొండ.. దాని నిండా అపారమైన గ్రానైట్ నిక్షేపాలు.. వాటిని తవ్విపోయడానికి ‘స్థానిక రాజు’గారితో సహా పలువురికి క్వారీ లీజులు.. కానీ కొండపైకి వెళ్లడానికి.. తవ్విన నిక్షేపాల రవాణాకు దారే లేదు.. కారణం.. కొండ దిగువన వందల ఎకరాల్లో సాగు భూములు ఉండటమే.. అవన్నీ ఎస్సీ, ఎస్టీ రైతుల అనుభవంలో ఉన్నవే.. మామూలుగా అడిగితే వాళ్లు ఇవ్వరు.. అందకని రాజుగారో పాచిక వేశారు.. తన క్వారీలకు దారి కోసం అడ్డదారి తొక్కారు.. దివంగత నేత వైఎస్ జమానాలో రైతులకు పట్టాలిచ్చినా.. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా తొక్కిపెడుతున్నారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకోవాలని.. వారంతట వారే భూములను తనకు ఇచ్చేసేలా మంత్రాంగం నెరుపుతున్నారు. ఇప్పటికే కొండకు మరోవైపున్న కొంత భూమిని చెరబట్టిన రాజుగారు.. ఇప్పుడు రైతుల భూమిపై కన్నేయడంతో వారంతా కలవరపడుతున్నారు.
విశాఖపట్నం: గ్రానైట్ నిక్షేపాల కోసం కొందరు పెద్దలు నిరుపేదల పొట్టకొడుతున్నారు. మహానేత వారికిచ్చిన భూములను కాజేయాలని చూస్తున్నారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా ఆ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకుండా మోకాలడ్డుతూ పేద రైతులకు సర్కారు నుంచి రుణాలు, ఇతరత్రా సాయం అందకుండా చేస్తున్నారు.
మాడుగుల మండలం విజేపురం రెవెన్యూ పంచాయతీ పరిధి సర్వే నెం.2 పరిధిలో ఉన్న కొండ ప్రాంతానికి చెందిన 373.32 ఎకరాల భూముల్లో కోమరి, మత్స్యపురం, విజేపురం, కొవ్వుగుంట, బుడ్డిబంద గ్రామాలకు చెందిన నిరుపేదలు సుమారు 30 ఏళ్లుగా జీడితోటలు సాగు చేసుకుంటున్నారు. సుమారు రెండు దశాబ్దాలకు ఆ భూములకు పట్టాలివ్వాలని పోరాటలు చేసినా నాటి టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. చివరికి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006లో చేపట్టిన ఇందిరమ్మ భూ పంపిణీలో వీరి ఆశలు ఫలించాయి. 70 మంది ఎస్టీలకు 170.58 ఎకరాలు, 41మంది ఎస్సీలకు 57.23 ఎకరాలు, 27 మంది బీసీలకు 43.31ఎకరాలు, 33 మంది ఇతరులకు 61 ఎకరాలు చొప్పున మొత్తం 203 మందికి 372.25 ఎకరాల భూములను కేటాయించారు. ఐదు, ఆరు విడతల్లో జరిగిన భూ పంపిణీలో డీ.ఫారం పట్టాలు, టైటిల్ డీడ్‌లు కూడా ఇచ్చారు. కాగా 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల నమోదుకు సంబంధించి వెబ్‌ల్యాండ్ ఆన్‌లైన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఆ మేరకు తమ భూములను తమ పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయాలని రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
గ్రానైట్ నిక్షేపాల కోసమే..
కొండ దిగువ భాగంలో వీరు సాగు చేసుకుంటుండగా..పై భాగంలో కోట్ల విలువైన గ్రానైట్ నిక్షేపాలున్నాయి. ఉర్వోవ కొండ తో పాటు పరిసర కొండల్లో ఉన్న గ్రానైట్ నిక్షేపాల వెలికితీతకు 50 మందికి పైగా లీజులు పొందారు. ఎమ్మెల్యే కూడా ఓ కొండను లీజుకు తీసుకున్నారు. కాగా రైతులు సాగు చేసుకుంటున్న ఉర్వోవ కొండపై భాగంలో కూడా సుమారు 3వేల హెక్టార్లలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటిలో ఇప్పటికే 150 హెక్టార్లలో కొండ ప్రాంతంలో గ్రానైట్ నిక్షేపాల వెలికితీత కోసం 10 క్వారీలకు అనుమతులిచ్చారు. మిగిలిన 2,850 హెక్టార్లలో లీజుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే బంధువులు, స్నేహితులు కలిసి సుమారు 110 మంది ఈ లీజుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రానైట్ నిక్షేపాల వెలికితీత కు కిందనున్న పట్టా భూములే అడ్డంకిగా ఉన్నాయి. ఇప్పటికే పైన లీజుకు తీసుకున్న లీజుదారులు సుమారు 15 ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. మిగిలిన భూములకు పట్టాలిచ్చి పూర్తి హక్కులు కల్పిస్తే పైనున్న గ్రానైట్‌ను తవ్వినా తరలించడానికి అడ్డంకిగా మారతాయి. ఈ కారణంగానే వీరి భూములను ఆన్‌లైన్‌లో పొందుపర్చకుండా.. పట్టాలివ్వకుండా మోకాలడ్డుతున్నారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే జరుగుతోందని.. అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఏదో విధంగా కాజేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో చేర్చకపోవడం వల్ల ఈ భూములకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే ఎరువులు, పురుగుల మందులే కాదు.. రుణాలు కూడా అందడం లేదు. 1-బీ అడంగల్, ఆన్‌లైన్‌లో నమోదైతేనే ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. అనేకమార్లు ‘మీ ఇంటికి మీ భూమికి’ కింద దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ కారణంగానే హుద్‌హుద్ సమయంలో పెద్ద ఎత్తున జీడితోటలు నేలకొరిగినా ఏ ఒక్కరికి కనీసం పైసా కూడా పరిహారం దక్కలేదు. ఇప్పటికైనా తమ భూములను వెబ్‌ల్యాండ్‌లో చేర్చి. ఈ పట్టాలు జారీ చేయాలని.. భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా మా భూములను లాక్కోవాలని చూస్తే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు.