సీఈవో భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: టీడీపీకి ఎక్కడలేని జనాదరణ లభిస్తోందంటూ సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో మోసపూరితంగా ప్రచారం చేయటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ ఆన్‌లైన్‌లో చేస్తున్న ఈ మోసాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కన్వీనర్ పీఎన్వీ ప్రసాద్ ఈమేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి ఫేస్‌బుక్ లాంటి సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లను వాడుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఎక్కడ లేని ఆదరణ లభిస్తోం దని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఆదరణకు ఆధారమైన ‘లైక్’లు వారి పార్టీకి అత్యధికంగా వచ్చినట్టు ఆన్‌లైన్ మోసానికి పాల్పడుతోంది. ఏప్రిల్ తొలి వారంలో టీడీపీకి ‘లైక్’లు గణనీయంగా పెరిగి 75 వేలకు చేరుకున్నాయని ప్రచారం చేసుకుంటోంది.
టీడీపీ మోసపూరితంగా లైక్‌ల సంఖ్యను పెంచి చూపుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 4వ తేదీలోగా కొన్ని గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో లైక్‌లు పెరగడం ఇందుకు నిదర్శనం. టర్కీలో 239 మంది భారతీయులు నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో తెలుగువారు అతికొద్ది మందే ఉంటారు. కానీ టర్కీ నుంచి టీడీపీకి 4,482 లైక్‌లు వచ్చాయట. ఫేస్‌బుక్ ‘లైక్’ల కొనుగోలు కుంభకోణాలకు టర్కీ పెట్టింది పేరు. లేని ఆదరణ ఉందని ప్రచారం చేసుకోవడానికి, లైక్‌లు వాడుకోవడం ద్వారా ఓటర్లకు టీడీపీ తప్పుడు సందేశాన్ని ఇస్తోంది. టీడీపీ ఇలాంటి మోసాలు, అక్రమ పద్దతులు అవలంభించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్ సీపీ నేత పీఎన్‌వీ ప్రసాద్ వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈనెల పదో తేదీన ఒక ఆంగ్ల పత్రికలో ‘తెలుగుదేశం ఇన్‌ప్లేట్స్ ఫేస్‌బుక్ బేస్ బైస్ లైక్స్ ఇన్ టర్కీ’ శీర్షికతో ప్రచురితమైన వార్తా కథనం క్లిప్పింగ్‌ను కూడా ఆయన సీఈవోకు సమర్పించారు.
టీటీడీలో ‘కోడ్’ ఉల్లంఘించిన చింతా, బాపిరాజు
అధికార పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ చింతా మోహన్ సిఫార్సు మేరకు 810 మంది శ్రీవారి సేవకులను (శ్రీవారి సేవక్స్)ను కల్యాణకట్టలో నియమించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశమేనని తెలిపారు.
టీడీపీ ఆన్‌లైన్ మోసాలపై చర్యలు తీసుకోండి
Published Sun, Apr 13 2014 1:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement