చేగుంట-మెదక్ రహదారిపై బైఠాయించిన రైతులు
మెదక్ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యంతో పాటు సేకరించిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు లారీల కొరత ఎదురవడంతో నెలల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని మండిపడ్డారు. దీంతో విసుగుచెంది రైతులు ఆదివారం మెదక్ మండలం రాజ్‌పల్లి వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. అలాగే ధాన్యపు రాశులకు నిప్పంటించారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌పల్లి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు 2 వేలకు పైగా ధాన్యం బస్తాలను సేకరించడం జరిగిందన్నారు. కాంటా చేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లుకు తరలించకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు కొందరు రైతులు ధాన్యాన్ని తరలిస్తుండగా, ట్రాక్టర్లు లేని చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టాపర్ల కిరాయిల ఖర్చులు వేలల్లో అవుతున్నాయని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. మెదక్ రూరల్ ఎస్‌ఐ కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పి తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. తహసీల్దార్ రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెండు లారీలను పంపిస్తున్నట్లు హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
చదవండి: భారీ మోసం: రైతులకు నిలువు దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment