సాక్షి, మెదక్‌జోన్: రుణమాఫీపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మెదక్ జిల్లాలో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మాఫీ కాగా.. ఇటీవల బడ్జెట్‌లో రుణమాఫీ విషయమై పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. అప్పులకు వడ్డీ పెరగడంతో పాటు కొత్త రుణాలు అందడం లేదని వాపోతున్నారు. జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా 1.40 లక్షల మంది రైతులు ఉన్నారు.
- జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా రూ.236 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో మొదటి విడతగా 2020లో రూ. 25 వేల లోపు రుణాలు తీసుకున్న 20,873 మంది రైతులకు రూ. 82.38 కోట్లు మాఫీ అయింది.
- ఇంకా 1,19,148 మంది రైతులు రూ. 50 వేల నుంచి లక్ష వరకు తీసుకున్న అప్పు రూ. 154 కోట్లు ఉంది.
- ఈ లెక్కన ఇంకా రూ. 11,655 కోట్ల మేర అప్పులు అలాగే ఉన్నాయి. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా వర్తించని విధంగా ఉంది.
- తీసుకున్న రుణాల్లో కేవలం 30శాతం మేరకే నిధులు కేటాయించడంతో జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- 2018 ఎన్నికల సమయంలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో తాము బ్యాంకులో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడు మాఫీ కాకుంటే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- జిల్లాలో మెజార్టీ రైతులకు రూ.లక్ష ఆ పైనే రుణాలు ఉన్నాయి. బ్యాంకర్లు ఎకరాకు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు పంట రుణం ఇస్తుండడంతో రెండెకరాలు ఉన్న రైతులు రూ.లక్ష, ఆపై రుణం తీసుకున్నారు.
- ప్రస్తుతం జిల్లాలో ఇంకా 1,19,148 మంది రైతులకు రూ. 154 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.
బ్యాంకర్ల నోటీసులు
- 2018లో రైతులు రూ. లక్ష లోపు తీసుకున్న రుణాలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో 60 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు.
- సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకర్లు నోటీసులు ఇచ్చారు.
- ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకుంటే కేవలం 7శాతం వడ్డీ మాత్రమే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది.
- ఇలా చెల్లించిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన వడ్డీలో సగం సబ్సిడీ రూపంలో రైతులకు తిరిగి చెల్లిస్తోంది.
- పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోగా రెన్యూవల్ చేయించకుంటే వడ్డీ ఏకంగా 14 శాతం పెరుగుతుంది. అంటే రెండింతలు అవుతుంది.
- లక్ష పంటరుణం తీసుకుంటే ప్రతి సంవత్సరం సక్రమంగా చెల్లించే రైతుకు 5 ఏళ్లకు చెల్లించే వడ్డీ రూ. 20 వేలు మాత్రమే నిర్ణీత గడువులోగా చెల్లించని రైతుకు వడ్డీ ఐదే సంవత్సరాలకు రూ. 70 వేల పైచిలుకు చెల్లించాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.
- సక్రమంగా చెల్లించే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ వడ్డీలో సగం తిరిగి సదరు రైతు ఖాతాలో జమ కట్టడంతో పాటు బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణంలో 10 శాతం పెంచి ఇస్తుంది.
- కాగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో జిల్లాలో 40 శాతం మంది రైతులు రెన్యూవల్ కూడా చేయలేదు.
ముమ్మాటికి మోసమే
నాకు నాలుగెకరాల భూమి ఉంది. 2018 డిసెంబర్‌లో రూ. లక్ష పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తీసుకున్న అప్పు కట్టలేదు. ఇప్పటివరకు అసలు రూ. లక్ష, వడ్డీ రూ. 80 వేలు కలిపి మొత్తం రూ. లక్షా 80 వేలు అయింది. ప్రస్తుతం ప్రభుత్వం రూ. 90 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేయాలి
– సాయిరెడ్డి, రైతు, మర్పల్లి రేగోడ్ మండలం
సకాలంలో రెన్యూవల్ చేసుకోవాలి
తీసుకున్న పంట రుణాలు సకాలంలో రెన్యూవల్ చేయకుంటే వ డ్డీ భారం పెరుగుతుంది. ఐదేళ్లలో తీసుకున్న రుణం రెండింతలు అవుతుంది. మా బ్యాంకులో 2,300 మంది రైతులు పంటరుణం తీసుకున్నారు. రుణాలు చెల్లించని 900 మంది రైతులకు నోటీసులు అందజేశాం.
– శ్రీకాంత్, ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్, చిన్న శంకరంపేట
Comments
Please login to add a commentAdd a comment