
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆరు రోజులుగా వాగు అవతల చిక్కుకున్న ముగ్గురు రైతులు ఎట్టకేలకు క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీమునిమల్లారెడ్డిపేట రైతులకు గ్రామ శివారులోని మానేరువాగు అవతల దాదాపు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వాగు దాటితేనే పొలాల వద్దకు చేరుకుంటారు. ఎప్పటిలాగే అదే గ్రామానికి చెందిన రైతులు అల్లాడి రాజం, మెతుకు ఎల్లయ్య, తిరుపతి గత శనివారం పొలం పనుల కోసం వాగు అవతలికి వెళ్లారు.
ఆ సమయంలో మానేరువాగులో వరద తక్కువగా ఉంది. ఆ తర్వాత రోజు నుంచి వర్షం కురవడంతో వాగులో ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. వెంట తీసుకెళ్లిన బియ్యం, కూరగాయలు ఉండటంతో ఆరు రోజులపాటు అక్కడే పొలం పనులు చేసుకుంటూ గడిపారు. సరుకులు ఖాళీ అవడంతో ఇంటికొచ్చేందుకు వారు శుక్రవారం ఉదయం వాగు తీరానికి చేరుకున్నారు.
వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు తెలియజేయగా...ఆయన జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే గంభీరావుపేట ఎస్సై మహేశ్, తహసీల్దార్ భూపతి, మత్స్యశాఖ అధికారి ఫయాజ్‌తోపాటు డీఆర్‌ఎఫ్ టీమ్ మానేరువాగు తీరానికి చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు రప్పించారు.