sirisilla district
-
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్!
ముస్తాబాద్(సిరిసిల్ల): క్రికెట్ అండర్–19 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికై , సంచలనం సృష్టించాడు 18 ఏళ్ల ఎరవెల్లి అవనీష్‌రావు. అంతేకాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు ఆడబోతున్నాడు కూడా! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన అవనీష్రావును.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు దక్కించుకుంది. దుబాయ్‌లో గత మంగళవారం జరిగిన ఐపీఎల్-2024 వేలంలో అతడిని సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో ఆట ప్రారంభం వికెట్ కీపర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అవనీష్‌రావు.. నెల రోజుల వ్యవధిలో ఆసియా కప్, ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ట్రై సీరిస్‌తోపాటు.. జనవరి 19 నుంచి జరగనున్న అండర్–19 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఐపీఎల్లో పెద్ద జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడు పోతుగల్‌కు చెందిన ఎరవెల్లి బాలకిషన్‌రావు సబ్‌రిజిస్ట్రార్‌గా రిటైరయ్యారు. ఆయన కుమారుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ లక్ష్మణ్‌రావు–సుష్మ దంపతుల కుమారుడు అవనీష్‌రావు బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించగా తండ్రి ప్రోత్సహించారు. నిత్యం జింఖానా మైదానంలో 10 గంటలకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. పాఠశాల చదువు సమయంలోనే అవనీష్‌రావు హైదరాబాద్ అండర్–14, 16కు ఎంపికయ్యాడు. హెచ్‌సీఏ సైతం అతని ప్రతిభ చూసి, చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బీసీసీఐ దృష్టిలో పడగా, అండర్–19 భారత జట్టుకు ఎంపిక చేసింది. తక్కువ వయసులో క్రికెట్లో రాణిస్తున్న అవనీష్‌రావు రాష్ట్ర యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి తనకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటే ఇష్టమని అవనీష్‌రావు తెలిపాడు. ఎడమ చేతివాటంతో ఆయన ఎంత ఫేమస్ అయ్యారో.. తాను కూడా అలా కావాలనుకున్నానని తెలిపాడు. తాను మొదట హైదరాబాద్‌లోని హిందూ మహావిద్యాలయలో చేరి, కోచ్ చందు ఆధ్వర్యంలో ఆటపై పట్టు సాధించానని, అనంతరం ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ అకాడమీలో చేరి, మరింత రాటుదేలినట్లు తెలిపాడు. పలు టోర్నీల్లో అవకాశాలు వచ్చాయని, అండర్–19 వరల్డ్ కప్‌కు ఎంపికవ్వాలనే లక్ష్యంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేశానన్నాడు. తన లక్ష్యం భారత సీనియర్ జట్టుకు ఎంపిక కావడమేనని పేర్కొన్నాడు. చదవండి: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నా: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చి నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోరాటాలు మాకేం కొత్త కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజల గొంతుకై మాట్లాడతాం. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం, పోవడం సహజం. నిరాశపడాల్సిన అవసరంలేదు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
అందరం ఒక్కటవుదాం
దుబ్బాక టౌన్/సిరిసిల్ల: ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టవద్దని, కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే ఢిల్లీయే పెత్తనం చెలాయిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు.కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని చావగొట్టిందని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులొస్తాయని 50 ఏళ్లు వెనక్కిపోతామని అన్నారు. అందరం ఒక్కటై ఢిల్లీ గద్దల నుంచి తెలంగాణను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు పొరపాటున కూడా ఓటు వేయవద్దని కోరారు. తెలంగాణపై సీఎం కేసీఆర్కున్న ప్రేమ ఢిల్లీ రాహుల్ గాంధీకి, మోదీకి ఉండదని స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు. మీకెందుకు చాన్స్ ఇయ్యాలి? ‘కాంగ్రెసోళ్లు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. 55 ఏళ్లలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం వెలగబెట్టారు? ఇప్పుడు మళ్లీ చాన్స్ ఇచ్చి ఎరువుల కోసం దుకాణాల ముందు క్యూలో నిలబడాలా? కరెంటు కోసం అర్ధరాత్రి మళ్లీ పొలాల కాడ పడుకోవాలా? అలాంటి కాంగ్రెస్ దరిద్రపు పాలన మనకు మళ్లీ కావాలా? ధరణిని తొలగించి మళ్లీ పట్వారీ విధానం అమలు చేస్తామంటున్నారు. రాహుల్, రేవంత్‌లకు ఎవసం, ఎద్దు తెల్వదు.. ఉత్తమ్ రైతుబంధు దుబారా అంటడు.. భట్టి ధరణి వద్దు అంటాడు..ధరణి కావాలా? దళారులు కావాలా? ఎట్లున్న తెలంగాణ ఎట్ల అయ్యింది? రైతులకు కడుపు నిండా 24 గంటల కరెంట్, సాగునీరు, ఇంటింటికీ తాగునీరు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ సాయం ఇలా ఎన్నో మంచి పనులు కేసీఆర్ చేశారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వస్తే.. ఇప్పుడు 46 లక్షల మందికి వస్తున్నాయి. ఈ పనులన్నీ కాంగ్రెసోళ్లకు కనపడ్తలేవా..? మళ్లీ మీకెందుకు చాన్స్ ఇయ్యాలి?..’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కత్తిపోటు రాజకీయానికి ఓటుతో బుద్ధి చెప్పాలి ‘పార్టీ దుబ్బాక అభ్యర్థి ప్రభాకరన్నను ఎన్నికల్లో ఎదుర్కోలేక కత్తితో పొడిచిండ్రు. కత్తిపోటు రాజకీయాలను ఓటుతో ఎదుర్కోవాలి. రఘునందన్‌రావును చిత్తుగా ఓడించి ప్రభాకరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి..’ అని కేటీఆర్ కోరారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ‘డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే, సీఎంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జనవరిలో కొత్త రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అర్హులకు అందిస్తాం. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని సవరించి మరింత మందికి పెన్షన్ అందిస్తాం. కోడళ్లకు సౌభాగ్య లక్ష్మీ పేరిట పెన్షన్లు ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందిస్తాం. రైతుబంధు ను ఎకరానికి ఏటా రూ.16 వేలు చొప్పున ఇస్తాం..’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ‘తొమ్మిదిన్నరేళ్లలో ఎ న్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమ లు చేశాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు.. గుజరాత్ నుంచి బీజే పీకి పైసలు వస్తున్నాయి. అంగట్లో పశువులను కొ న్నట్లు కొంటున్నారు. మోదీ, అమిత్ షా, రాహుల్, సిద్ధరామయ్య, షేర్లు, బబ్బర్ఖాన్లు ఎంతమంది వచి్చనా సరే సింహం సింగిల్‌గా వచ్చినట్లు కేసీ ఆర్ దూసుకుపోతున్నారు..’ అని పేర్కొన్నారు. కారు ఉండగా బేకార్గాళ్లెందుకు రాంగోపాల్‌పేట్/కంటోన్మెంట్ (హైదరాబాద్): బక్క పలుచని కేసీఆర్‌ను ఓడించి తెలంగాణ గొంతు పిసికేందుకు ఢిల్లీ నుంచి షేర్లు, శంషేర్లు వస్తున్నారని, కారు ఉండగా ఇలాంటి బేకార్‌గాళ్లు మనకెందుకని కేటీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సనత్‌నగర్ నియోజకవర్గంలోని మహంకాళి దేవాలయం వద్ద, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నానగర్, పికెట్ చౌరస్తాల్లో నిర్వహించిన రోడ్డు షోల్లో ఆయన ప్రసంగించారు. కంటోన్మెంట్ సమస్యలకు విలీనమే పరిష్కారం: ‘కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న కంటోన్మెంట్ అభివృద్ధిలో వెనుకబడిన మాట వాస్తవమే. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే కంటోన్మెంట్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది..’ అని మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇటీవల సంచలనంగా మారిన బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత, డబుల్ బెడ్రూమ్ బాధితుడి సంభాషణల వీడియోలపై ఆయన స్పందించారు. బీజేపీ వాళ్లు చిల్లర వీడియోలతో బదనాం చేస్తున్నారని, సాటి ఆడకూతురుని అవమానించిన బీజేపీని బొందపెట్టాలని మహిళలను ఆయన కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత తదితరులు పాల్గొన్నారు. -
కూతురు సాయంతో భర్తను చంపేసింది
సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన లేచర్ల ప్రకాశ్‌రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు. వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్‌రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు. కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్‌రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్‌లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఇలా వెలుగులోకి.. ప్రకాశ్‌రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్‌రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్ సీఐ ఉపేందర్ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్‌కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ప్రకాశ్‌రావు (ఫైల్) -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. -
క్షేమంగా ఒడ్డుకు చేరిన రైతులు
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆరు రోజులుగా వాగు అవతల చిక్కుకున్న ముగ్గురు రైతులు ఎట్టకేలకు క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీమునిమల్లారెడ్డిపేట రైతులకు గ్రామ శివారులోని మానేరువాగు అవతల దాదాపు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వాగు దాటితేనే పొలాల వద్దకు చేరుకుంటారు. ఎప్పటిలాగే అదే గ్రామానికి చెందిన రైతులు అల్లాడి రాజం, మెతుకు ఎల్లయ్య, తిరుపతి గత శనివారం పొలం పనుల కోసం వాగు అవతలికి వెళ్లారు. ఆ సమయంలో మానేరువాగులో వరద తక్కువగా ఉంది. ఆ తర్వాత రోజు నుంచి వర్షం కురవడంతో వాగులో ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. వెంట తీసుకెళ్లిన బియ్యం, కూరగాయలు ఉండటంతో ఆరు రోజులపాటు అక్కడే పొలం పనులు చేసుకుంటూ గడిపారు. సరుకులు ఖాళీ అవడంతో ఇంటికొచ్చేందుకు వారు శుక్రవారం ఉదయం వాగు తీరానికి చేరుకున్నారు. వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు తెలియజేయగా...ఆయన జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే గంభీరావుపేట ఎస్సై మహేశ్, తహసీల్దార్ భూపతి, మత్స్యశాఖ అధికారి ఫయాజ్‌తోపాటు డీఆర్ఎఫ్ టీమ్ మానేరువాగు తీరానికి చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు రప్పించారు. -
వేములవాడలో బీజీపీ నేతల మధ్య టికెట్ ఫైట్
సిరిసిల్ల జిల్లా: తెలంగాణాలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గేరు మార్చి స్పీడును పెంచేశాయి. ఇదిలా ఉండగా వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ జరుగుతోంది. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ తారాస్థాయికి చేరుకుంది. వివాదాస్పద పోస్టర్లు.. ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో టికెట్య్ కోసం దరఖాస్తు చేసుకున్న తుల ఉమ వేములవాడలో పాగా వేసే క్రమంలో 'సాలు దొర - సెలవు దొర' అంటూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పోస్టర్స్ ద్వారా అభ్యర్ధించారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. సాలు దొర - సెలవు దొర పోస్టర్ల పేరిట తుల ఉమ ఓవైపు కేసీఆర్ పాలనను లక్ష్యం చేసుకుని మరోవైపు వేములవాడలో చెన్నమనేని వంశీయుల పాలనపైన కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. దీంతో వేములవాడలో బీజేపీ రెండు గ్రూపులుగా చీలిపోయినట్లయింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయించాలో అర్ధంకాక బీజేపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. టికెట్ వార్.. వేములవాడలో బీజేపీ టికెట్ బీసీలకే కేటాయిస్తారని ఆ ప్రకారం చూస్తే తమకే టికెట్ దక్కుతుందని తుల ఉమ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఎర్రం మహేష్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా చెన్నమనేని వికాస్ ఎంట్రీతో వేములవాడ బీజేపీలో రసాభాస మొదలైంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
భవనం పై నుంచి కిందపడ్డ యువకుడు.. 10 గంటలు చీకట్లో నరకయాతన..
రాజన్న: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చీకట్లో ఎవరూ చూడకపోవడంతో దాదాపు 10 గంటలు నరకయాతన పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను(26) గురువారం రాత్రి భోజనం అనంతరం భవనంపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. చీకటి కావడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి చిన్ను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
సిరిసిల్లలో టీఆర్ఎస్ ధర్నా
-
పద్మశాలి భవన నిర్మాణానికి రూ.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పద్మశాలి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం నిర్మాణ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కార్యక్రమంలో భాగంగా ఈ భవనాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలంలో నిర్మించనున్నారు. -
కుట్లు వేశారు.. కడుపులో సూది మరిచారు!
సిరిసిల్లక్రైం: కడుపు నొప్పితో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన లచ్చవ్వ కడుపునొప్పితో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు గర్భసంచి ఆపరేషన్ చేశాడు. కొన్నాళ్లకు కడుపులో మళ్లీ నొప్పి రావడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె టాబ్లెట్స్ వాడింది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించుకోగా కడుపులో సూది, దారం ఉన్నట్లు నిర్ధారించారు. గర్భసంచి ఆపరేషన్ సమయంలో కుట్లు వేయడానికి ఉపయోగించిన సూది, దారం కడుపులోనే మరచిపోవడంతో తరచూ ఈ కడుపు నొప్పి వస్తున్నట్లు స్కానింగ్ చేసిన వైద్యుడు తెలిపారు. అయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఆస్పత్రి వివిధ కారణాలతో మూతపడింది. ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న అప్పటి వైద్యుడిని సంప్రదిస్తే తనకు సంబంధం లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని అనడంతో బాధితురాలు కన్నీరుమున్నీరు అవుతోంది. తనకు న్యాయం చేయాలని లచ్చవ్వ వేడుకుంటోంది. -
ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు
సిరిసిల్ల: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మాట్లాడుతూ, విద్యావలంటీర్లను, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి ఉసురు సీఎం కేసీఆర్‌కు తగులుతుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామన్నారు. చాలా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, సీఎం కేసీఆర్ తన బొమ్మను పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితుల కోసం ప్రధాని మోదీ ‘స్టాండప్ ఇండియా’పథకాన్ని అమలు చేస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు ఒక్కో దళితుడికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ష్యూరిటీ, వడ్డీ లేకుండా రుణాలిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బతుకమ్మ పండుగను కూడా డిస్కో డ్యాన్స్‌లా చేశారని, బతుకమ్మ పండుగతో కవితకు ఏం సంబంధమని సంజయ్ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ అంటే సీఎం కేసీఆర్‌కు వణుకుపుడుతుందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే, పాకిస్తాన్ వెళ్లి కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. కర్ణాటక ఎంపీ మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్ మార్చ్
సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత నిర్వహించే మిలియన్‌మార్చ్ ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్ చెబుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. అన్నీ ఆయన కుటుంబానికే... తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు. -
ఎన్నికల హామీలు ఏమయ్యాయి?
ముస్తాబాద్/సిరిసిల్ల: గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్ర గనులు, రైల్వే శాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్‌పాటిల్ ధన్వే డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఎక్కడ అని ప్రశ్నించారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు కేంద్రమంత్రి పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ఇప్పటివరకు కేంద్రమిచ్చిన నిధులకు లెక్కలెందుకు చూపడంలేదని నిలదీశా రు. కాగా,వడ్లు కొనేదిలేదని, దొడ్డు వడ్లు వేయొ ద్దని సీఎం కేసీఆర్ రైతులను బెదిరిస్తే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగం గా రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో శుక్రవా రం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. -
వ్యాధుల నివారణ, చికిత్స హెల్త్ ప్రొఫైల్‌తోనే సాధ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సంబంధించి కనీస ఆరోగ్య సమాచారాన్ని సేకరించడం ద్వారా వివిధ శాఖల పరిధిలో మెరుగైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, విశ్లేషించడం ద్వారా వివిధ జిల్లాల్లో ఉన్న వ్యాధులు, సీజనల్ వ్యాధుల తీరుతెన్నులను గుర్తించే వీలు కలుగుతుందని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలసి గురువారం ప్రగతిభవన్‌లో కేటీఆర్ సమీక్షించారు. వైద్య, ఆరోగ్య, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా చికిత్స, నివారణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో చికిత్స అందించేందుకు ప్రజారోగ్యంపై సేకరించే ప్రాథమిక సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ రెండు జిల్లాల్లోని వైద్య, ఆరోగ్య సిబ్బంది సహకారంతో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యంగా రక్తపోటు, మూత్ర, రక్త పరీక్షలను ప్రజల ఇళ్ల వద్దే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎవరికైనా అదనంగా ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది, పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హెల్త్ ప్రొఫైల్‌ను రికార్డు చేసిన ఈస్టోనియా వంటి దేశాల నమూనాలను కూడా అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం మారుమూల ములుగు జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. -
పేద క్రీడాకారుడికి ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఓ నిరుపేద క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గుండారం గ్రామానికి చెందిన క్రీడాకారుడు ముడావత్ వెంకటేశ్ ఇటీవల నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో డిప్లొమా కోర్సులో సీటు సంపాదించాడు. అయితే, పేద గిరిజన కుటుంబానికి చెందిన వెంకటేశ్‌కు ఆ కోర్సులో చేరేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించాడు. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెం దిన టీఆర్ఎస్ యువజన llనేత ఉగ్గం రాకేశ్‌యాదవ్ వెంకటేశ్‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా గురువారం రూ. 1.8 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేశ్ యాదవ్‌ను కేటీఆర్ అభినందించారు. -
తాగుబోతుకు అత్తింట పరాభవం
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఓ తాగుబోతు కానిస్టేబుల్‌కు గ్రామస్తులు తగ్గిన బుద్ధి చెప్పారు. నిత్యం వేధిస్తుండటంతో దసరా పండుగపూట ఇంటికి పిలిచి దేహశుద్ధి చేశారు. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన కానిస్టేబుల్ అశోక్‌కు ముస్తాబాద్‌కు చెందిన అనితతో రెండు నెలల క్రితమే వివాహం అయింది. పెళ్లయినప్పటి నుంచి అశోక్ నిత్యం తాగివచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై అనిత కుటుంబసభ్యులకు తెలిపింది. మంగళవారం పండుగ అత్తవారింటికి మద్యం మత్తులో వచ్చిన అశోక్‌ను కుటుంబసభ్యులు నిలదీశారు. అతడు ఎదురు తిరగటంతో గ్రామస్తుల సాయంతో స్తంభానికి కట్టేసి భార్య సహా అందరూ అతడిని చితకబాదారు. ఆపైన, గ్రామంలో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. -
సిరిసిల్ల జిల్లా కోసం హామీ ఇవ్వలేదు
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కోసం పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు మౌనం వీడారు. అవసరమైన భౌగోళిక విస్తీర్ణం, జనాభా లేనందున సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యంకాదని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలతో ఇదే విషయూన్ని తేల్చి చెప్పిన మంత్రి.. గురువారం సిరిసిల్ల ప్రజలకు బహిరంగ లేఖ రాసి, మీడియూకు విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లా సాధ్యం కానందున.. పట్టణాన్ని జిల్లాకేంద్రం కంటే రెట్టింపు స్థారుులో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. సిరిసిల్లను జిల్లా చేస్తామని టీఆర్ఎస్ పార్టీ గానీ, తానుగానీ వాగ్దానం చేయలేదన్నారు. కొత్త జిల్లాల ముసాయిదాలో సిరిసిల్ల లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారన్నారు. సిరిసిల్లలో ఉన్న డివిజన్ కార్యాలయూలన్నీ ఇక్కడే కొనసాగుతాయని, మరిన్ని కొత్త ఆఫీసులు వస్తాయని, సిరిసిల్ల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదామని, కలసి నడుద్దామని కోరుతున్నానంటూ కేటీఆర్ బహిరంగ లేఖను ముగించారు. నమ్మకముంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి.. లేఖ రాయడానికి ముందు కేటీఆర్ హైదరాబాద్‌లో సిరిసిల్ల టీఆర్ఎస్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వడానికి చాక్లెట్ కాదంటూ టీఆర్ఎస్ నేతలతో వాదించినట్లు సమాచారం. నాయకులను బట్టి జిల్లాలు ఇవ్వాల్సి వస్తే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎందుకు జిల్లా కాలేదని నిలదీశారు. ‘నాపై నమ్మకముంటే.. పార్టీలో ఉండండి. ఇష్టం లేనివారు వెళ్లిపోండి’ అంటూ ఒకింత ఆగ్రహంతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాలలు, రైల్వేలైన్, ఇతర శాశ్వత అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. సిరిసిల్ల విషయంలో తాను తప్పు చేస్తే సిరిసిల్ల గాంధీ సెంటర్లో ప్రజల ముందు క్షమాపణ కోరుతానంటూ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులతో ఆవేశంగా చెప్పినట్లు సమాచారం. -
సిరిసిల్ల జిల్లా కోసం పోరాటం
టీపీసీసీ నేత కె.కె.మహేందర్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని టీపీసీసీ నేత కె.కె.మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిరిసిల్లను జిల్లాగా చేయాలని శాంతియుతంగా అడుగుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ ఉద్యమాలు చేయడం, అరెస్టులు కావడం తెలంగాణ ప్రజలకు కొత్తకాదన్నారు. -
ఊపందుకున్న ఉద్యమం
సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం తీవ్రం 11వ రోజుకు న్యాయవాదుల రిలేదీక్షలు అఖిలపక్షం రాస్తారోకో, ధర్నా సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధనే లక్ష్యంగా చేపట్టిన ఉద్యమమే ఊపిరిగా జేఏసీ ముందుకెళ్తుందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదులు చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం 11వ రోజుకు చేరాయి. వీరి దీక్షలకు సెస్‌చైర్మన్, సీనియర్ న్యాయవాది దోర్నాల లక్ష్మారెడ్డి, అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపారు. సిరిసిల్ల జిల్లా సాధిద్దామని దోర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య మాట్లాడుతూ తాము ఆమరణ దీక్ష చేపట్టినా పట్టింపులేకుండా వ్యవహరించడం సరికాదన్నారు. జిల్లా సాధనకు ధైర్యంగా పోరాడే వారే తమతోపాటు ఉద్యమించాలని అధికార పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రిలేదీక్షల్లో నాగరాజు, శశాంక్, శ్రీనివాస్, సురేష్‌ప్రసాద్, శ్రీనివాస్‌రావు, మురళి, రమేశ్, వేణు, శాంతిప్రకాశ్‌శుక్లా, సత్యనారాయణ, ఆంజనేయులు, సురేష్, గణేష్, జనార్దన్‌రెడ్డి, శ్రీకర్‌బాబు, మల్లేశం పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆడెపు రవీందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు, అఖిలపక్షం, ప్రజాసంఘాల నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, స్వర్గం ప్రసాద్, మోర రవి, గడ్డం నాగరాజు, రొడ్డ రాంచంద్రం, కుడిక్యాల రవీందర్ మద్దతు పలికారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి సిరిసిల్లను జిల్లా చేయాలన్న ప్రజా ఆకాంక్షను నెరవేర్చాలని ప్రభుత్వ ఉపాధ్యాయుల జేఏసీ నాయకులు కోరారు. ఈమేరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైన మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఎంపీపీ దడిగెల కమలాభాయి, జెడ్పీటీసీ సభ్యురాలు పూర్మాణి మంజుల, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణిలకు వినతిపత్రాలు అందించారు. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు దొంతుల శ్రీహరి, సుధాకర్‌రెడ్డి, కృష్ణప్రసాద్, నారాయణ, బాలకిషన్, మధుసూదన్, శ్రీనివాస్‌రావు, నరేందర్, సతీశ్, శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, ఆంజనేయులు, రమేశ్‌నాయక్, బిక్కూనాయక్ తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట : సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు గంభీరావుపేటలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని, లేకుంటే ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. దళిత సంఘాల నాయకులు దోసల చంద్రం, మంగళి చంద్రమౌళి, ఆవునూరి బాబయ్య, దోసల ఊపేంద్ర, కర్రొల్ల రాజు, ఎడబోయిన రాజు, రాగిశెట్టి నారాయణ, బిక్షపతి, అనిల్ పాల్గొన్నారు. అఖిలపక్షం ధర్నా కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ నాయకులు మండలకేంద్రంలో ధర్నా, రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎగదండి స్వామి, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, ఎడబోయిన ప్రభాకర్, ప్రవీన్, భిక్షపతి, మల్లేశం, బీఎస్పీ మండలాధ్యక్షుడు కర్రొల్ల రాజు, బీజేపీ నాయకుడు బాలశంకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు చేని వెంకటస్వామి పాల్గొన్నారు.