సిరిసిల్ల జిల్లా కోసం హామీ ఇవ్వలేదు
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కోసం పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు మౌనం వీడారు. అవసరమైన భౌగోళిక విస్తీర్ణం, జనాభా లేనందున సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యంకాదని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలతో ఇదే విషయూన్ని తేల్చి చెప్పిన మంత్రి.. గురువారం సిరిసిల్ల ప్రజలకు బహిరంగ లేఖ రాసి, మీడియూకు విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లా సాధ్యం కానందున.. పట్టణాన్ని జిల్లాకేంద్రం కంటే రెట్టింపు స్థారుులో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
సిరిసిల్లను జిల్లా చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ గానీ, తానుగానీ వాగ్దానం చేయలేదన్నారు. కొత్త జిల్లాల ముసాయిదాలో సిరిసిల్ల లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారన్నారు. సిరిసిల్లలో ఉన్న డివిజన్ కార్యాలయూలన్నీ ఇక్కడే కొనసాగుతాయని, మరిన్ని కొత్త ఆఫీసులు వస్తాయని, సిరిసిల్ల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదామని, కలసి నడుద్దామని కోరుతున్నానంటూ కేటీఆర్ బహిరంగ లేఖను ముగించారు.
నమ్మకముంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి..
లేఖ రాయడానికి ముందు కేటీఆర్ హైదరాబాద్‌లో సిరిసిల్ల టీఆర్‌ఎస్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. సిరిసిల్ల జిల్లా ఇవ్వడానికి చాక్లెట్ కాదంటూ టీఆర్‌ఎస్ నేతలతో వాదించినట్లు సమాచారం. నాయకులను బట్టి జిల్లాలు ఇవ్వాల్సి వస్తే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఎందుకు జిల్లా కాలేదని నిలదీశారు. ‘నాపై నమ్మకముంటే.. పార్టీలో ఉండండి. ఇష్టం లేనివారు వెళ్లిపోండి’ అంటూ ఒకింత ఆగ్రహంతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాలలు, రైల్వేలైన్, ఇతర శాశ్వత అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. సిరిసిల్ల విషయంలో తాను తప్పు చేస్తే సిరిసిల్ల గాంధీ సెంటర్‌లో ప్రజల ముందు క్షమాపణ కోరుతానంటూ కేటీఆర్ టీఆర్‌ఎస్ నాయకులతో ఆవేశంగా చెప్పినట్లు సమాచారం.