స్కానింగ్‌లో కనిపిస్తున్న సూది, దారం
సిరిసిల్లక్రైం: కడుపు నొప్పితో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కడుపులోనే సూది, దారం మరచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళకు ఇటీవల మళ్లీ కడుపునొప్పి వస్తుండడంతో స్కానింగ్ చేయించుకోగా అసలు విషయం వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన లచ్చవ్వ కడుపునొప్పితో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది.
ఆమెను పరీక్షించిన వైద్యుడు గర్భసంచి ఆపరేషన్ చేశాడు. కొన్నాళ్లకు కడుపులో మళ్లీ నొప్పి రావడంతో తాత్కాలిక ఉపశమనం కోసం ఆమె టాబ్లెట్స్ వాడింది. ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించుకోగా కడుపులో సూది, దారం ఉన్నట్లు నిర్ధారించారు. గర్భసంచి ఆపరేషన్ సమయంలో కుట్లు వేయడానికి ఉపయోగించిన సూది, దారం కడుపులోనే మరచిపోవడంతో తరచూ ఈ కడుపు నొప్పి వస్తున్నట్లు స్కానింగ్ చేసిన వైద్యుడు తెలిపారు.
అయితే అప్పుడు ఆపరేషన్ చేయించుకున్న ఆస్పత్రి వివిధ కారణాలతో మూతపడింది. ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న అప్పటి వైద్యుడిని సంప్రదిస్తే తనకు సంబంధం లేదని, దిక్కున్నచోట చెప్పుకోమని అనడంతో బాధితురాలు కన్నీరుమున్నీరు అవుతోంది. తనకు న్యాయం చేయాలని లచ్చవ్వ వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment