ప్లకార్డుతో నిరసన చేస్తున్న బుచ్చయ్య
భూపాలపల్లి అర్బన్: భార్య మరణంతో ఒంటరైపోయిన తండ్రిని చేరదీసి బాగోగులు చూసుకోవాల్సిన కొడుకులు నిర్ధాక్షిణ్యంగా వదిలే శారు. కొడుకులుండి అనాథగా మారిన ఆ తండ్రి తనను చూడటం లేదన్న ఆవేదనతో నిరసనకు దిగాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రేగొండ మండలం గొరికొత్తపల్లి గ్రామానికి చెందిన కట్ల బుచ్చయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు.
కొడుకులిద్దర్నీ బాగా చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దారు బుచ్చయ్య దంపతులు. ఇద్దరు కొడుకులూ పోలీసుశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం బుచ్చయ్య భార్య మరణించింది. దీంతో ఆస్తిని కొడుకులిద్దరికీ పంచిన బుచ్చయ్య 30 గుంటల భూమిని మాత్రం తన పేరుమీద ఉంచుకున్నాడు. కొద్ది రోజులక్రితం పెద్దకొడుకు రవీందర్ ఆ భూమిని సైతం అమ్మించి వచ్చిన డబ్బులను ఇవ్వకుండా బ్యాంకులో జాయింట్ ఖాతా తీసి అందులో జమ చేశాడు. అప్పట్నుంచి బుచ్చయ్యను ఇద్దరు కొడుకులూ చూడటం మానేశారు.
జయశంకర్ విగ్రహం ఎదుట ..
కొడుకులు తనను పట్టించుకోకపోవటంతో బుచ్చ య్య జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ‘నాకు న్యాయం కావా లి.. నా కొడుకులు నన్ను సాదడం లేదు’ అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపారు. తన బాగోగులు చూసుకోవాలని అడిగితే ఇద్దరు కొడుకులు దౌర్జన్యానికి దిగారని బుచ్చయ్య ఆరోపిస్తున్నారు. కొడుకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినట్లు బుచ్చయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment