సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించే క్రమంలో రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాల తీరుపై భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సీరియస్‌గా ఉంది. సేకరించిన ధాన్యాన్ని బియ్యం(సీఎంఆర్)గా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని.. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యానికి బదులు పాత బియ్యం, రీసైక్లింగ్ చేసిన పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం ఇస్తున్నారని భావిస్తోంది.
దీంతో రాష్ట్రం లోని అన్ని మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేశాకే బియ్యం సేకరించాలని జిల్లాల వారీగా ఎఫ్‌సీఐ అధికారులకు ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు ఎఫ్‌సీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ బుధవారం లేఖ రాశారు. గత నెలలో భౌతిక తనిఖీల్లో మాయమైన ధాన్యం ఏమైందో తేల్చాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులను ఎఫ్‌సీఐ ఆదేశించినట్లు సమాచారం.
18,156 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం
2020–21 యాసంగి, 2021–22 వానకాలం సీజన్లలో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం తీసుకెళ్లిన రైస్ మిల్లులు.. ఆ బస్తాలను నిల్వ చేసి ఎప్పటికప్పుడు మర పట్టించి బియ్యంగా ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించిన విషయం గత నెలలో వెలుగు చూసింది. దీంతో మార్చి 20 నుంచి 23వ తేదీ వరకు 425 మిల్లుల్లో 2020–21 యాసంగి ధాన్యం బస్తాలను, 533 మిల్లుల్లో మొన్నటి వానకాలం సీజన్ ధాన్యం బస్తాలను ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేశారు.
2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 19 మిల్లుల్లో 1.96 లక్షల ధాన్యం సంచులు, వానకాలం ధాన్యానికి సంబంధించి 21 మిల్లుల్లో 2.58 లక్షల ధాన్యం సంచులు.. మొత్తంగా 18,15 మెట్రిక్ టన్నుల (4.54 లక్షల బ్యాగులు) ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. ఈ ధాన్యం బస్తాలకు సంబంధించిన వివరాలేవీ మిల్లర్లు వెల్లడించకపోవడంతో చర్యలు తీసుకోవాలని మార్చి 30న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ సమాచారమిచ్చింది. గతంలోనూ 20 మిల్లుల్లో జరిపిన భౌతిక తనిఖీల్లో 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 1.76 లక్షల బ్యాగులు మిస్సయ్యాయి.
ఏమాత్రం తేడా ఉన్నా..
గత మార్చిలో 3,278 రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలకు ఎఫ్‌సీఐ ఆదేశించింది. అయితే 958 మిల్లుల్లో జిల్లా స్థాయి ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేయగా 40 మిల్లుల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇంకో 2,320 మిల్లుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రక్రియ సాగలేదు. తాజాగా యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున గత సంవత్సరం యాసంగి, వానాకాలం ధాన్యం నిల్వలపై తనిఖీలు జరపాలని సంస్థ నిర్ణయించిన ఎఫ్‌సీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 కల్లా మిగిలిన 2,320 మిల్లుల్లో ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా ఉంచాలని ఆదేశించింది.
28న అన్ని మిల్లుల్లో పౌరసరఫరాల శాఖతో కలిసి ఎఫ్‌సీఐ ఫిజికల్ వెరిఫికేషన్ జరపనుంది. బస్తాల లెక్కతో పాటు ఇప్పటి వరకు మిల్లుల్లో సాగిన లావాదేవీలు, లెక్కలనూ అధికారులు తనిఖీ చేయనున్నారు. ధాన్యం బస్తాల నిల్వల్లో ఏమాత్రం తేడాలున్నా రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. యాసంగి సీజన్‌లో ముడి బియ్యాన్ని సీఎంఆర్‌గా చేసివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ఇప్పటికే ఆందోళన చెందుతున్న మిల్లర్లకు ఇది అశనిపాతమే.
పాతవో, కొత్తవో తేల్చేందుకు పరీక్షలు
మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే బియ్యం విషయంలో ఇక కఠినంగా ఉండాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. బియ్యం ఏ సీజన్‌లో పండిన ధాన్యానికి సంబంధించిందో తేల్చడంతో పాటు ముడి బియ్యమా, ఉప్పుడు బియ్యమా లేక స్టీమ్డ్ రైసా నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతితో లిట్మస్ టెస్టు నిర్వహించనుంది. థియో–బార్బిట్యూరిక్ యాసిడ్ (టీబీఏ)తో పరీక్షించడం ద్వారా బియ్యం నాణ్యత తెలుస్తుందని ఇప్పటికే తేలడంతో ఎఫ్‌సీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment