సాక్షి, హైదరాబాద్/బషీరాబాద్: ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో (ఇంజన్)లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఇంజన్లో మంటలు రావడాన్ని గమనించిన లోకో పైలెట్లు వెంటనే అప్రమత్తమయ్యా రు. ఈ సంఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వికారాబాద్–వాడీ మార్గంలో నవంద్గీ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి 8.40 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు నవంద్గీ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు లోకో పైలెట్లు గుర్తించారు.
అలాగే వెళితే మధ్యలో రైలు ఆగిపోయి ఇబ్బంది తలెత్తుతుందన్న ఉద్దేశంతో స్టేషన్‌లోనే నిలిపివేశారు. అప్పటికే ఇంజన్‌లోంచి దట్టంగా పొగలు వస్తున్నాయి. ఆ కొద్దిసేపటికే మంటలు కూడా లేచాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఇంజన్‌ను బోగీల నుంచి వేరు చేసి దూరంగా తీసుకెళ్లారు. స్టేషన్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైరింజన్ మంటలను ఆర్పివేసింది. తర్వాత అధికారులు సమీపంలోని తాండూరు స్టేషన్‌నుంచి వేరే ఇంజన్‌ను తెప్పించి రైలును పంపివేశారు.
కారణం తెలియదు.. చిన్న ప్రమాదమే
లోకోలో మంటలు చెలరేగటానికి కారణం తెలియదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ పేర్కొన్నారు. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని సిబ్బంది పసిగట్టి స్టేషన్‌లో రైలును ఆపారని, తర్వాత పొగలు వచ్చి స్వల్పంగా మంటలు చెలరేగాయని వెల్లడించారు. ఈ ప్రమాదం చిన్నదే అని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. తాండూరు నుంచి మరో లోకోను తెప్పించి రైలును పంపివేసినట్టు చెప్పారు. 35 నిమిషాలపాటు రైలు నిలిచిపోయిందని రైల్వే సిబ్బంది వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment