ఉట్నూర్ లిక్కర్ డిపోలో దగ్ధమవుతున్న మద్యం నిల్వలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లిక్కర్ డిపోలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.90 కోట్ల విలువైన మద్యం నిల్వలు దగ్ధమైనట్లు డిపో మేనేజర్ ప్రభుదాస్ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని డిపో అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్‌లోని తెలంగాణ రాష్ట్ర బ్రివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌బీసీఎల్) గోదాంలో 1985 నుంచి లిక్కర్ డిపో నిర్వహిస్తున్నారు.
ఈ డిపో నుంచి ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని వైన్స్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ డిపోలో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. కాసేపటికే మంటలు చెలరేగి మద్యం నిల్వలను చుట్టుముట్టాయి. మంటల ధాటికి లిక్కర్ బాటిళ్లు పేలిపోవడంతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. లిక్కర్‌లో ఉన్న స్పిరిట్ వల్ల మంటలు దావానలంలా వ్యాపించాయి.
లోపలి నుంచి బాటిళ్లు పేలిపోయి పైకప్పురేకులను పగలగొట్టుకొని బయటకు వచ్చిపడ్డాయి. ఉట్నూర్‌కు సమీపంలో ఉన్న ఆరు అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అవి అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 50 వేల ఐఎంఎల్ కేసులు, 30 వేల బీర్ల కేసులు ఉన్నాయని, వీటి విలువ రూ.90 కోట్లు ఉంటుందని డిపో మేనేజర్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ఎక్సైజ్ శాఖ విచారణ మొదలుపెట్టినట్టు తెలిసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి అధికారులు రానున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment