తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లిన నేతలు, ప్రముఖులు
విమానం టికెట్లకు విపరీతంగా డిమాండ్.. రెండు, మూడు రెట్లు పెరిగిన చార్జీలు
రైళ్లలోనూ భారీగా వెయిటింగ్ లిస్టులతో సీట్లు దొరకని పరిస్థితి
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రిలకు తిరిగొచ్చేందుకు తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారానికి అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలకు కేబినెట్‌లో చోటు దక్కడంతో.. వారి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలోనే హస్తినకు పయనమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారంతా తిరిగిరావడానికి మాత్రం ఇక్కట్లు మొదలయ్యాయి. విమానాలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో.. ఎయిర్‌లైన్స్ సంస్థలు చార్జీలను రెండు, మూడింతలు పెంచేశాయి. మరోవైపు రైళ్లలోనూ విపరీతంగా వెయిటింగ్ లిస్టులతో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఎక్కడికి వెళ్లాలన్నా..
తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లేప్పుడు రూ.10– 12 వేలు టికెట్ ధర ఉండగా.. తిరిగి వచ్చేందుకోసం టికెట్ల ధరలు రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు టికెట్ చార్జీలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ (గన్నవరం), రేణిగుంట (తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఇలా ఎక్కడికైనా ఇదే పరిస్థితి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు దాదాపు 20కిపైగా విమాన సర్వీసులు.. విజయవాడ, రేణిగుంట(తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరంలకు రెండు, మూడు చొప్పున సర్వీసులు ఉన్నాయి. ఒకట్రెండ్ స్టాప్‌లతో మరో పది వరకు సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ చార్జీలు పెరిగిపోయాయి.
రైళ్లలో సీట్ల కోసం ‘ఈక్యూ’రిక్వెస్టులు
విమాన టికెట్ భారం ఎక్కువైందని భావించేవారు, టికెట్ దొరకనివారు.. రైళ్లలో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సికింద్రాబాద్, విజయవాడ ప్రాంతాలకు ఉన్న ఏడెనిమిది రైలు సరీ్వసుల్లో స్లీపర్‌క్లాస్‌లో భారీగా వెయిటింగ్ లిస్టులు ఉంటే.. ఏసీ కోచ్‌లలో సీట్లు అందుబాటులోనే లేవని చూపిస్తోంది. దీంతో రైలు టికెట్ కన్‌ఫర్మేషన్ కోసం ఈక్యూ (ఎమర్జెన్సీ కోటా) లెటర్ ఇవ్వాలంటూ ఎంపీలను కోరుతున్నారు. అయినా సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం ఉదయం వెళ్లాల్సినవారు శనివారమే ఈక్యూ లెటర్ ఇచి్చనా.. టికెట్లు కన్‌ఫర్మ్ కాక ఢిల్లీలోనే ఆగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment