ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట యోధుడి కన్నుమూత | Fluoride Victim Amshala Swamy Passes Away In Nalgonda | Sakshi
Sakshi News home page

ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట యోధుడి కన్నుమూత

Published Sun, Jan 29 2023 3:49 AM | Last Updated on Sun, Jan 29 2023 2:59 PM

Fluoride Victim Amshala Swamy Passes Away In Nalgonda - Sakshi

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో శివన్నగూడెంలోని అంశాల స్వామి ఇంటికి వెళ్లి ఆయనకు అన్నం వడ్డిస్తున్న మంత్రి కేటీఆర్‌ (ఫైల్‌)  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మర్రిగూడ: ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట యోధుడు అంశాల స్వామి (37) కన్నుమూశారు. శుక్రవారం సాయంత్రం ఎలక్ట్రిక్‌ (3 చక్రాల) సైకిల్‌పై తండ్రితో కలసి ఊరికి వెళ్లి వచ్చి ఇంటి ముందు ర్యాంప్‌ ఎక్కే క్రమంలో ఆయన కింద పడిపోయారు. శనివారం ఉదయం రక్తపు వాంతులతో స్వామి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించగా, స్వామిని పరీక్షించిన ఆయన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108కు కాల్‌ చేశారు.

అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి స్వామిని పరీక్షించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. ట్రైకిల్‌ పై నుంచి పడినప్పుడు స్వామి తలలో అంతర్గతంగా గాయాలైనట్లు భావిస్తున్నారు. స్వామి మృతిచెందడంతో ఆయన స్వగ్రామం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో విషాదఛా­యలు అలుముకున్నాయి. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ సమస్య ప్రస్తావన రాగానే వెంటనే అంశాల స్వామి గుర్తుకు వస్తారు.

దీనితోనే ఫ్లోరైడ్‌ సమస్యపై జిల్లాలో ఉద్యమం జరిగిన తీరు, అందులో స్వామి పాత్ర ఎంత కీలకమన్నది అర్థం చేసుకోవచ్చు. ఫ్లోరోసిస్‌ బాధితుల తరఫున ఆయన ఢిల్లీలో తన గళం వినిపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ ఫ్లోరోసిస్‌ సమస్య కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అందులో అంశాల స్వామి కీలక భూమిక పోషించారు.

అనేక ఏళ్లపాటు ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాటంలో భాగస్వా­మి అయ్యారు. అంశాల స్వామి గర్భస్థ ఫ్లోరైడ్‌ బాధి­తుడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల వెంకటమ్మ, సత్యనారాయణకు నలుగురు సంతానం. అందులో పెద్దవాడైన స్వామికి 37 ఏళ్లు. ముగ్గురు చెల్లెళ్లలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే, మరొకరు ఫ్లోరోసిస్‌తోనే మృతి చెందారు. కాగా, శనివా­రం సాయంత్రం స్వామి అంత్యక్రియలను నిర్వహించారు.  

ప్రతిపోరాటంలో ముందున్న స్వామి 
నదీ జలాల ద్వారానే ఫ్లోరైడ్‌ సమస్య పీడ విరగడవుతుందన్న భావనతో ఏర్పాటైన జల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ  స్వామి కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధానమంత్రులు వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్, దేవెగౌడ, చంద్రశేఖర్‌ను కలిశారు. పలువురు ముఖ్యమంత్రులను కలసి ఫ్లోరైడ్‌ సమస్యను వివరించారు. 17 సార్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలు చేశారు. ఐక్యరాజ్యసమితి వరకు ఫ్లోరైడ్‌ సమస్యను తీసుకెళ్లగలిగారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌ను కలసి ఫ్లోరోసిస్‌ సమస్యకు కృష్ణా జలాలతోనే పరిష్కారం లభిస్తుందని వివరించారు. 

ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి ఎన్నికల్లో పోటీ 
ఫ్లోరైడ్‌ సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు అంశాల స్వామి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అప్పట్లో నాంపల్లి మండల జెడ్పీటీసీగా పోటీ చేశారు. వారణాసిలో ఎంపీగా పోటీ చేసి సమస్యను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు.  

ప్రత్యేక కార్పొరేషన్‌ కావాలని.. 
ఫ్లోరోసిస్‌ బాధితులు మంచానికే పరిమితమై కుటుంబానికి భారమవుతున్నందున ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్పొరేష¯న్‌ ఏర్పాటు చేసి ఫ్లోరైడ్‌ వికలాంగులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల పింఛన్‌ ఇవ్వాలని స్వామి అడుగుతుండేవారు. కాగా, శివన్నగూడెం ప్రాజెక్టుకు అంశాల స్వామి పేరు పెట్టాలని జల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కంచుకట్ల సుభాష్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

బ్యాటరీ ట్రైసైకిల్‌లో డిజైన్‌ లోపం వల్లనే అంశాల స్వామి ప్రమాదానికి గురై మృతి చెందాడని వారు ఆరోపించారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామికి ఓ సంస్థ ఈ ట్రైసైకిల్‌ను ఇచ్చిందని వారు తెలిపారు.  స్వామి మృతిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు వివిధ సంఘాలు, పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement