సాక్షి,నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా,నాగర్ కర్నూల్ మండలం నాగనూలు కస్తూరిబా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కస్తూరిబా పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఫలితంగా ఇటీవల కాలంలో పాఠశాలలో భోజనం తిని అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. అందుకు నవంబర్ 27న నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
మాగనూర్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థతకు గురై వారం రోజులు కాకుండానే.. అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు ' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment