
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సాయిబులగుంపులోని కనకరాజు గుట్ట (పెద్ద గుట్ట)పై పులి ఐదు రోజులుగా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఆవును చంపి తిన్న కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెల 29న తుమ్మలచెరువు గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవు మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దాన్ని పులి చంపి ఉంటుందని అందరూ భావించారు. శుక్రవారం ఎఫ్‌ఆర్వో ప్రసాదరావు ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు పెద్ద గుట్టపై గాలింపు చర్యలు చేపట్టారు.
అక్కడ దుర్వాసన వస్తున్న ఆవు కళేబరంతో పాటు పరిసరాల్లో పులి పాదముద్రలు, సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో ఆవును పులే చంపి తిన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. పులి కనిపించలేదని ఎఫ్‌ఆర్వో తెలిపారు. గురువారం పత్తి చేల నుంచి కొందరు రైతులు, కూలీలు పత్తి తీసుకొని ట్రాక్టర్లపై వస్తుండగా మార్గమధ్యలో వారికి పులి కనిపించింది. వారి అరుపులు, కేకలకు పులి తిరిగి గుట్టపైకి వెళ్లినట్లు వారు చెప్తున్నారు. కాగా.. రైతులు, కూలీలు పత్తి చేల వద్దకు, పశువులు, జీవాల పెంపకందారులు అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment