రూ.80 కోట్ల భూమికి ఎసరు | Forgery signature by the deceased tehsildar | Sakshi
Sakshi News home page

రూ.80 కోట్ల భూమికి ఎసరు

Published Wed, Sep 16 2020 6:19 AM | Last Updated on Wed, Sep 16 2020 8:28 AM

Forgery signature by the deceased tehsildar - Sakshi

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలోని 181 సర్వే నంబర్‌లోని వివాదాస్పద భూమి ఇదే

రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. కీసర తహసీల్దార్‌ నాగరాజు,, మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ అవినీతి బాగోతం మరవకముందే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మరో భూబాగోతం వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు.. ఏకంగా రూ. 80 కోట్ల విలువైన అసైన్డ్‌ భూమికి ఎసరు పెట్టారు. పైగా చనిపోయిన తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్రకు తెర తీశారు. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో.. అనుమానం వచ్చి కలెక్టర్‌ విచారణకు ఆదేశించడంతో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ సహా మరొకరిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది.

సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబరు 181లో అసైన్డ్‌ భూమి ఉంది. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఈ భూమి రూ.కోట్లలో విలువ చేస్తుండటంతో.. 2013లో జిన్నారంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్‌ఓ జే.వెంకటేశ్వర్‌రావు తదితరుల కన్ను పడింది. అయితే.. అసైన్డ్‌భూమి మాజీ సైనికులకు కేటాయించే వెసులుబాటు ఉండటంతో.. తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్‌.గంగాధర్‌రావు, ఎం.మధుసూదన్‌లను మభ్యపెట్టి రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. వీరు జిన్నారం తహసీల్‌ కార్యాలయంలో భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదెకరాల చొప్పున నలుగురికి 20 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. ప్రస్తుతం దాని విలువ రూ.80 కోట్లు ఉంది. అయితే.. మాజీ సైనికులు, రెవెన్యూ అధికారుల మధ్య ఏ మేరకు ఒప్పందం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.   

మృతి చెందిన తహసీల్దార్‌ పేరుతో నకిలీ పట్టాలు  
అసైన్డ్‌ భూమిని తాము నేరుగా కేటాయిస్తే ఇరుకున పడతామనే ఉద్దేశంతో అప్పటి తహసీల్దార్‌ తదితరులు పకడ్బందీ వ్యూహం రచించారు. ఇందుకుగాను 2010 కంటే ముందు జిన్నారంలో పనిచేసి మృతి చెందిన తహసీల్దార్‌ పరమేశ్వర్‌ సంతకంతో పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని పథక రచన చేశారు. ఈ మేరకు నోట్‌ కూడా తయారు చేశారు. తాము ఎంపిక చేసిన నలుగురు మాజీ సైనికులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మొత్తం 20 ఎకరాలు.. మృతి చెందిన తహసీల్దార్‌ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను సృష్టించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా 2007 నుంచి పహాణీ మొదలుకొని ఇందుకు సంబంధించిన అన్ని భూ రికార్డులు మాజీ సైనికుల పేర్లతో ఉన్నట్లుగా రికార్డులలో దిద్దడం చేశారు. 

నిందితులపై క్రిమినల్‌ చర్యలు 
జిన్నారం మండలం భూ బాగోతంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు మాజీ సైనికులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, అప్పటి డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణలను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే.. వీఆర్వో వెంకటేశ్వర్‌ రావు, ఆర్‌ఐ విష్ణువర్ధన్, సర్వేయర్‌ లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ సహదేవ్, 2019లో సంగారెడ్డి ఆర్డీఓపై కూడా శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సైనికులు వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్‌ గంగాధర్‌రావు, ఎం మధుసూదన్‌లకు కేటాయించిన అసైన్డ్‌ పట్టాలను కూడా రద్దు చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.   

గుట్టు రట్టయిందిలా.. 
మాజీ సైనికులకు కేటాయించినది అసైన్డ్‌ భూమి కావడంతో ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) అవసరమైంది. ఎవరికైనా అసైన్డ్‌ భూమి కేటాయించిన పదేళ్ల తర్వాత వారికి ఈ భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు (అమ్ముకోవడానికి వీలుగా) లభిస్తాయి. దీం తో 2019లో వారు ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌కు పంపిన ఫైళ్లలో రెవెన్యూ అధికారులు రాసుకు న్న ప్లాన్‌ పేపర్‌ (నోట్‌) కూడా ఉంది. దీంతో కలెక్టర్‌ హనుమంతరావుకు అనుమానం వచ్చింది. వెంటనే మైనార్టీ సంక్షేమ అధికారి తిరుపతిరావును విచారణ అధికారిగా నియమించారు. పూర్తి విచారణ అనంతరం.. అప్పట్లో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌ కె.నారాయణ, వీఆర్వో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడింది నిజమేనంటూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కలెక్టర్‌ ప్రభుత్వానికి సమర్పించారు.  

అక్రమాలు వాస్తవమే  
జిన్నారం మండలం ఖాజీపల్లి సర్వే నం.181లో అసైన్డ్‌ భూమి ఉన్నమాట వాస్తవమే. చనిపోయిన తహసీల్దార్‌ పరమేశ్వర్‌ సంతకం ఫోర్జరీ అయినట్లు అనుమానంతో విచారణకు ఆదేశించా. దీంతో అసలు విషయం బయటపడింది. నలుగురు మాజీ సైనికులకు కేటాయించిన 20 ఎకరాల భూమిని ప్రస్తుతం సుమారుగా రూ.80 కోట్లు విలువ చేస్తుంది. 
– హనుమంతరావు, కలెక్టర్, సంగారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement