హైదరాబాద్‌లో ఉన్న ల్యాబ్ ఆధునీకరణ
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
ఫార్మా కంపెనీలు, దుకాణాల్లోవిస్తృత తనిఖీలకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు.
డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్‌ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment