‘గీతా’ సంకల్పం  | Free distribution of Bhagavad Gita to 4618 people for five years | Sakshi
Sakshi News home page

‘గీతా’ సంకల్పం 

Published Mon, Sep 4 2023 1:41 AM | Last Updated on Mon, Sep 4 2023 1:41 AM

Free distribution of Bhagavad Gita to 4618 people for five years - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌:  సంకల్పం ఉంటే..సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎన్ని అవాంతరాలు..ఎన్ని అడ్డుంకులు ఎదురైనా సరే ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రతి ఇంటా భగవద్గీత ఉండాలన్నదే లక్ష్యంగా నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేందర్‌గుప్తా సంకల్పించారు. ఐదేళ్లుగా ఉచితంగా భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,618 భగవద్గీత గ్రంథాలను అందజేశారు.

తన తుదిశ్వాస ఉన్నంతవరకు భగవద్గీత గ్రంథాలు పంచుతూనే ఉంటానని జ్ఞానేందర్‌గుప్తా చెబుతున్నారు. పదకొండేళ్లుగా తన తండ్రి మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులు, వైద్యులు, వ్యాపారులు మొదలు... సాధారణ వ్యక్తులు వరకు భగవద్గీత చేరేలా నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. భగవద్గీతతోపాటు రామకోటి పుస్తకాలు కూడా పంచుతున్నారు. పదుల సంఖ్యలో రామాయణం, మహాభారతం, భాగవతం పుస్తకాలు పంపిణీ చేశారు. 

4  భాషల్లో  
‘గీతా జయంతి’పేరిట ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకునే ఒకే ఒక్క గ్రంథం ‘భగవద్గీత’. ఈ గ్రంథానికి ఉన్న గుర్తింపు ప్రపంచంలో ఏ గ్రంథానికీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు, అత్యున్నతస్థాయి వ్యక్తులు భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే. జ్ఞానేందర్‌గుప్తా గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్‌ నుంచి ఆర్డర్‌పై భగవద్గీత గ్రంథాలు తెప్పిస్తున్నారు.

ఈ గ్రంథం 880 పేజీల్లో 18 అధ్యాయాలు, 745 శ్లోకాలతో సవివరంగా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, మరాఠీ భాషల్లో ముద్రించిన గ్రంథాలను పంపిణీ చేస్తున్నారు. గీతాసారం అన్ని భాషల్లో ఉన్న వారికి అర్థమయ్యేలా చేర్చాలన్న సంకల్పంతో ఇలా చేస్తున్నారు. ఇటీవల దక్షిణకొరియా ఒకరు అడగ్గా కొరియర్‌లో భగవద్గీత పంపాడు, యూఎస్‌కు అయితే రెగ్యులర్‌గా ఆయనే కొరియర్‌ ద్వారా చేరవేస్తున్నారు.

మరికొన్ని సేవా కార్యక్రమాల్లో...
నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సొంతూరైన సిరిసిల్ల జిల్లా కనగర్తిలలో స్వర్గ రథాలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రెండునెలల్లో కాశీలోనూ స్వర్గరథం ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిజామాబాద్‌లో మృతదేహాలను పెట్టేందుకు 8 ఏళ్ల నుంచి 10 ఫ్రీజర్‌లు ఉచితంగా అందుబాటులో ఉంచారు. 

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు ‘అమర్‌నాథ్‌ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2011 ప్రతి ఏటా 60 రోజులు అన్నదానం, ఇతర సేవలు అందజేస్తున్నారు. 

ఎండాకాలంలో పిచ్చుకలు, పక్షులు నీటికోసం అలమటిస్తాయి. వాటి దాహార్తి తీర్చేందుకు రెండేళ్లలో 2,500 పైగా ‘బర్డ్‌ ఫీడర్‌ బాక్సులు’ఉచితంగా అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement