సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి వర్క్‌బుక్స్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కూడా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్‌ను, నోటు పుస్తకాలను పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ద్విభాషా పాఠ్యపుస్తకాలను పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి అందించాలని అదేశించారు.
గత సంవత్సరం పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, రానున్న విద్యా సంవత్సరంలో రూ.200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నా మని మంత్రి తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్‌ను పాఠశాలల పునః ప్రారంభం నాటికి అందించాలని సూచించారు.
ఎమ్మెల్యేల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సబిత అధికారులకు చెప్పారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతి నిధులు పాఠశాలకు హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment