భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం | Future planning is complex | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు ప్రణాళిక బహు క్లిష్టం

Published Wed, Sep 25 2024 4:37 AM | Last Updated on Wed, Sep 25 2024 4:37 AM

Future planning is complex

ప్రణాళికల రూపకల్పనలో 69 శాతం భారతీయుల వెనకడుగు 

భారతీయులకు తోడుగా 47 శాతం అమెరికన్లు... 

హెచ్‌ఎస్‌బీసీ తాజా నివేదికలో వెల్లడి...

సాక్షి, హైదరాబాద్‌: సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు.. ఎవరైనా భవిష్యత్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కీలకం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. భవిష్యత్తు ప్రణాళిక క్లిష్టంగా మారుతోంది. భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, స్తబ్ధతలో కూరుకుపోతున్నామనే భా వనలో మెజారిటీ ప్రజలున్నారు. 

69 శాతం మంది భారతీయులు భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని తేలింది. ఊహించని మార్పులను ఎదుర్కొంటున్నట్టుగా 91 శాతం మంది అంగీకరించారు. పరిస్థితుల ›ప్రభావంతో ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లుతుండడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్ధంగా లేమని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా.. సరైన వేళకు.. సరైన నిర్ణయాలు తీసుకో లేకపోతున్నామని మధనపడుతున్నట్లు 57 శాతం పేర్కొన్నారు.  

ఇదీ అధ్యయనం.. 
హెచ్‌ఎస్‌బీసీ సంస్థ ఆధ్వర్యంలో.. భారత్, హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, యూకే, యూఎస్‌లలోని వివిధ రంగాలు, మార్కెట్లకు చెందిన దాదాపు 18వేల మంది వ్యక్తులు (దాదాపు 4 వేల బిజినెస్‌ లీడర్లు)పై జరిపిన గ్లోబల్‌ స్టడీ ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలపై హెచ్‌ఎస్‌బీసీ ఇండియా హెడ్‌ (వెల్త్‌ అండ్‌ పర్సనల్‌ బ్యాంకింగ్‌) సందీప్‌ బాత్రా స్పందిస్తూ.. 

దైనందిన జీవనంలో సమస్యలు ఎదురైనపుడు వాటిని ఎదుర్కొనేందుకు.. ఏదో ఒక రూపంలో సహాయపడాలని హెచ్‌ఎస్‌బీసీ భావిస్తోందని తెలిపారు. వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ప్రజలకు తగిన సలహాలు, సూచనలిచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జీవితంలో క్లిష్టమైన సవాళ్లు ఎదురైనపుడు అంతర్జాతీయ నెట్‌వర్క్‌ సహాయంతో అనిశి్చతిని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.  

నివేదికలో ఏముందంటే.. 
» వేగంగా మార్పులు సంభవిస్తున్న యుగంలో తామున్నట్టు 91 శాతం మంది భారతీయుల భావన 
»  భవిష్యత్‌ ప్రణాళికల రచనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 69 శాతం మంది ఉన్నారు. 
»  తీసుకున్న నిర్ణయాల అమలుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందనుకున్నవారు 62 శాతం మంది ఉన్నారు. 
»  తగిన సమయంలో అవకాశాలు కోల్పోయినందుకు, తగిన నిర్ణయం తీసుకోలేకపోయినందుకు చింతిస్తున్నవారు 57 శాతం మంది ఉన్నారు. 
»  తాము తీసుకున్న నిర్ణయాలు చివరకు సరైనవి కావనే భావనలో 46 శాతం మంది ఉన్నారు. 
»   సరైన నిర్ణయాలు తీసుకోలేక.. వాటిని వీలైనంత వాయిదా వేస్తున్న వారు 42 శాతం మంది ఉన్నారు. 
»  నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు 33 శాతం మంది ఉన్నారు.

భారత్‌కు యూఎస్‌ తోడు
ఈ అధ్యయనానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. భారత్‌లో మాదిరిగానే యూఎస్‌ఏలోనూ 47 శాతం మంది అ మెరికన్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు.

»  అమెరికన్లలో 33 శాతం మంది తాము తీసుకున్న పాత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  
» ఐదేళ్లలో.. ఇతరులతో సంబంధం లేకుండా వేరుగా ఉన్నామనే భావనలో 43 శాతం అమెరికన్‌ మహిళలున్నారు. అదే పురుషుల విషయానికొస్తే 26 శాతంగా ఉంది.
» యూఎస్‌లో బిజినెస్‌ లీడర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోల్చితే భవిష్యత్‌ ప్రణాళికలు మరింతగా సవాళ్లతో కూడుకున్నవనే భావనలో 51 శాతం మంది ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement