Telangana: Folk Singer Gaddar Passed Away At Apollo Hospital - Sakshi
Sakshi News home page

Folk Singer Gaddar Passes Away: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

Published Sun, Aug 6 2023 3:22 PM | Last Updated on Sun, Aug 6 2023 4:59 PM

Gaddar Passed Away At Apollo Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్‌ తుదిశ్వాస విడిచారు. 

కాగా, గద్దర్‌ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే, గద్దర్‌ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్‌ సక్సెస్‌ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. 

ఇక, తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గద్దర్‌ 1949లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని తుప్రాన్‌లో జన్మించారు. గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివారు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 

► 1969 ఉద్యమంలో కూడా గద్దర్‌ పాల్గొన్నారు. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్‌ కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అన్న పాటును గద్దర్‌ రాశారు. అనేక పాటు స్వరపరిచారు.

► ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్‌ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. 

► 1975లో కెనరా బ్యాంకులో గద్దర్‌ ఉద్యోగం చేశారు. హన్మాజీపేట స్వగ్రామం. 1984లో కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ పోరాడారు.

1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్‌కౌంటర్లను గద్దర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు.

 ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్‌ అందుకున్నారు. ఒరేయ్‌ రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు నంది అవార్డు వచ్చింది. 

► గద్దర్‌ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్‌ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్‌ లేరన్న వార్త తమను షాక్‌కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

► గద్దర్‌ మృతిపై సీఎల్పి నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement