సాక్షి, హైదరాబాద్: మహానగరం భక్తజన సంద్రమైంది. ఆదివారం హైదరాబాద్‌లో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలు, డప్పు కళాకారుల దరువులు, యువత నృత్యాలు, విభిన్న రూపాల్లో దర్శనమిచ్చిన గణపతులు, పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంపాటలతో శోభాయాత్రలో ఆద్యంతం పండుగ వాతావరణం నెలకొంది. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు హుస్సేన్‌సాగర్ సహా వివిధ చెరువుల్లో నిమజ్జనపర్వం కొనసాగింది.
ముఖ్యంగా 40 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య ఉదయం 10:30 గంటలకు మొదలైన పంచముఖ రుద్ర మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 3:23 గంటలకు నిమజ్జనంతో ముగిసింది. మధ్యాహ్నం నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భక్తులు భారీ స్థాయిలో యాత్రను తిలకించేందుకు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లు జాతరలను తలపించాయి. సోమవారం తెల్లవారుజాము వరకు హుస్సేన్‌సాగర్‌లో సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 25 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ప్రమాదాలు జరగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాగర్‌లో పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్సేన్‌సాగర్ వద్ద 40 క్రేన్లను ఏర్పాటుచేసి నిమజ్జనం నిర్వహించారు.
బాలాపూర్ వినాయకుడి లడ్డూతో శశాంక్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
బాలాపూర్ లడ్డూ 18.90లక్షలు
►ప్రసాదాన్ని ఏపీ సీఎం జగన్‌కు అందిస్తామన్న వేలంపాట విజేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ ఈ ఏడాదీ రికార్డు ధర పలికింది. ఆది వారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన వేలంపాటలో ఏకంగా రూ. 18.90 లక్షలకు (2019లో రూ. 17.60 లక్షలు పలికింది) లడ్డూ అమ్ముడుపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్ గుల్‌కు చెందిన అబాకస్ విద్యాసంస్థల అధినేత మర్రి శశాంక్‌రెడ్డి సంయుక్తంగా లడ్డూ ప్రసా దాన్ని చేజిక్కించుకున్నారు. వేలంలో బాలాపూర్ లడ్డూను పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమేశ్ యాదవ్ తెలిపారు. ఈ ప్రసాదాన్ని ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి అందజేస్తానని చెప్పారు. రమేశ్ సహాయంతో ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని మర్రి శశాంక్‌రెడ్డి పేర్కొన్నారు. వేలంపాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డాక్టర్ అనితా హరినాథ్‌రెడ్డి, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్లెం నిరంజన్‌రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment