రామచంద్రాపురం(పటాన్‌చెరు): రెండు తలల పాములను విక్రయిస్తున్న ఓ ముఠాను రామచంద్రాపురం, ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పాములు, రూ.1,90,000, రెండు కార్లు స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం మియాపూర్ ఏసీపీ నరసింహారావు, సంగారెడ్డి డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావులు విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మాణిక్‌రెడ్డి రామచంద్రాపురంలోని జ్యోతినగర్‌లో నివాసముంటున్నాడు. మాణిక్‌రెడ్డి అద్దెకు కార్లు తిప్పుతుండగా, ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌తో స్నేహం ఏర్పడింది.
మాణిక్‌రెడ్డి రెండుతలల పామును గురించి తెలుసుకొని వాటిని విక్రయిస్తే పెద్దఎత్తున డబ్బు వస్తుందని భావించాడు. ఆ క్రమంలో చంద్రశేఖర్‌తో రెండు తలల పాము గురించి మాట్లాడాడు. రెండు తలల పాములు తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రశేఖర్, నవీన్, భాస్కర్‌లు నల్లమల అటవీ ప్రాంతం నుంచి రెండు తలల పాములు రెండింటికి తీసుకొని మాణిక్‌రెడ్డి ఇంటికి ఈనెల 15వ తేదీన వచ్చారు. వీటిని విక్రయించేందుకు మాణిక్‌రెడ్డి కర్ణాటకకు చెందిన ఓ ముఠాతో సంప్రదింపులు చేశాడు. గురువారం చంద్రశేఖర్‌కు డబ్బు ఇస్తానని చెప్పి మాణిక్‌రెడ్డి ఇంటికి పిలిచాడు.
అదే సమయంలో పాములను కొనుగోలు చేసేందుకు కర్ణాటక నుంచి పలువురు వచ్చారు. కచ్చితమైన సమాచారం రావడంతో రామచంద్రాపురం పోలీసులు, మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు మాణిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. మాణిక్‌రెడ్డితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్, నవీన్, భాస్కర్, కర్ణాటకకు చెందిన ఎండీభాష, రాఘవేందర్, రమేష్, షేక్ సికిందర్, విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. రెండుపాములను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో సీఐ సంజయ్‌కుమార్, ఎస్‌ఓటి సీఐ శివశంకర్, అటవీశాఖ రేంజర్ వీరేంద్రబాబు, ఎస్‌ఐ శశికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూఢనమ్మకాలతోనే పాములకు ముప్పు
మూఢనమ్మకాలతో రెండు తలకాయల పాము జాతి అంతరించిపోతుందని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే తక్కువ సమయంలో ధనవంతులు అవుతారన్న మూఢనమ్మకం అనేకమందికి ఉందన్నారు. గుప్త నిధులను గుర్తించడంలో రెండు తలల పాము ఉపయోగపడుతుందన్న మూఢనమ్మకంతో వీటి క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఇది సరైనది కాదని, వీటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment