బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు | GHMC Council Holds First Ever Virtual Meeting | Sakshi
Sakshi News home page

బల్దియా బడ్జెట్‌: రూ. 6841.87 కోట్లు

Published Wed, Jun 30 2021 8:31 AM | Last Updated on Wed, Jun 30 2021 8:36 AM

GHMC Council Holds First Ever Virtual Meeting - Sakshi

జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలి ఏర్పాటైన ఐదు నెలల తర్వాత..మొట్టమొదటి సమావేశం మంగళవారం వర్చువల్‌గా నిర్వహించారు. కోవిడ్‌ నిబంధనల కారణంగానే బల్దియా చరిత్రలోనే మొదటిసారిగా వర్చువల్‌ సమావేశం నిర్వహించగా.. సభ్యులంతా ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో చెత్త, నాలాల సమస్యలపై సభ్యులు మండిపడ్డారు. కరోనాతోపాటు వర్షాకాల వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతుంటే అధికారులు పారిశుధ్య నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పలేకే వర్చువల్‌గా నిర్వహించారన్నారు. ఎన్నో కార్యక్రమాలు గుంపులతో జరుగుతున్న తరుణంలో వర్చువల్‌గా నిర్వహించడాన్ని తప్పుబట్టారు. గత పాలకమండలి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆమోదించిన రూ. 5600 కోట్లకు తోడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం వచ్చే నిధులను కూడా కలిపి మొత్తం రూ.6841.87 కోట్ల బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది.
–సాక్షి, సిటీబ్యూరో

♦ రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఫుట్‌పాత్‌లు, పచ్చదనం పెంపు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్, నాలా పనులకు కూడా ఎక్కువ నిధులు కేటాయించారు.  
♦పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం నుంచి రూ.936 కోట్లు రాగలవనే అంచనాతో వాటిని బడ్జెట్‌లో పొందుపరిచారు. బాండ్ల ద్వారా పొందిన  రుణాల చెల్లింపులు, వడ్డీలకు రూ.228.78 కోట్లు ఖర్చుకానున్నట్లు పేర్కొన్నారు.  
♦ 2020 డిసెంబర్‌ ఒకటో తేదీన ఎన్నికలు ముందస్తుగా జరిగినా..గత పాలకమండలి గడువు ముగియనందున 2021 ఫిబ్రవరి 11 వరకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరగలేదు. ఆ తర్వాత కరోనాతో సహ వివిధ కారణాలతో సర్వసభ్య సమావేశంజరగలేదు.  
♦ మేయర్‌తోపాటు కమిషనర్‌ లోకేశ్‌కుమార్, ఉన్నతాధికారులు జీహెచ్‌ఎంసీ కాన్ఫరెన్స్‌ హాల్‌నుంచి పాల్గొన్నారు. గత నవంబర్‌లో స్టాండింగ్‌ కమిటీ ఆమోదించినప్పుడు ‘బి’ బడ్జెట్‌ లేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు వచ్చే నిధులను ‘బి’గా పేర్కొంటూ ఇప్పుడు చేర్చారు. సభాధ్యక్ష స్థానం నుంచి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ చేపట్టిన, చేయనున్న కార్యక్రమాల గురించి  ప్రసంగించారు. 

చెత్తమయంగా నగరం: ఎంఐఎం 
ఎంఐఎంకు చెందిన జాఫ్రీ, మాజిద్‌ హుస్సేన్, సున్నం రాజ్‌మోహన్, సలీంబేగ్‌  తదితరులు మాట్లాడుతూ కాగితాల్లో భారీ కేటాయింపులు వాస్తవంగా ఖర్చు చేయడం లేరన్నారు.  డంపర్‌బిన్లు తొలగించేందుకు సిటీ కమిషనర్‌ జాగీరా అని ప్రశి్నంచారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లులేక, డంపర్‌బిన్లు తొలగించడంతో నగరం చెత్తదిబ్బగా మారిందన్నారు. ఇళ్లనుంచి చెత్త తరలించాల్సిన స్వచ్ఛ ఆటోలతో మెయిన్‌రోడ్లపై చెత్త తొలగిస్తున్నారని, అలాంటప్పుడు వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.వీరంతా దారుస్సలాం నుంచి పాల్గొన్నారు.  

కుంభకోణాలకు ఆస్కారం: బీజేపీ  
ఇది తూతూమంత్రపు బడ్జెట్‌ అని బీజేపీ సభ్యుడు  దేవర కరుణాకర్‌ అన్నారు. పేదల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని  భూసేకరణ, గ్రీనరీల పేరిట వందల కోట్ల రూపాయలు కేటాయించడం కుంభకోణాలకు ఆస్కారమిస్తుందన్నారు.  ప్రతిపక్షాలు ప్రశి్నస్తుంటే  వినిపించకుండా మ్యూట్‌లో పెట్టారని, బడ్జెట్‌లో లెక్కలకు, సమావేశంలో కమిషనర్‌  లెక్కలకు తేడా ఉందన్నారు.  ఈ బడ్జెట్‌ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నాలా సమస్యలు పట్టించుకోవడం లేరని బీజేపీకే  చెందిన శంకర్‌యాదవ్‌ తదితరులు విమర్శించారు.   బడ్జెట్‌పై  మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు అవకాశంఇవ్వనందుకు ఆపార్టీకి చెందిన రజిత  నిరసన వ్యక్తం చేశారు.

కరోనాతోపనుల్లో జాప్యం:కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ 
కరోనా కారణంగా  అన్ని పనులు పూర్తిస్థాయిలో చేయలేకపోయామని సభ్యలడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా బారిన పడి జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు 31 మంది మృతి చెందారన్నారు. వారి కుటుంబాలకందాల్సిన ప్రయోజనాలు అందించామన్నారు.  

కొత్త సభ్యుడి ప్రమాణస్వీకారం.. 
లింగోజిగూడ ఉప ఎన్నికలో గెలిచిన రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మేయర్‌ విజయలక్షి్మని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి మేయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం ప్రారంభానికి ముందుగా మేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

‘పట్టణ ప్రగతి’లో పాల్గొనండి   
జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు పెద్దయెత్తున నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలి. ఇందులో వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష ఉంటుంది. సీజనల్‌ వ్యాధుల నివారణకు భారీయెత్తున పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, నీటినిల్వల తొలగింపు, నగరంలో చెత్త తొలగింపు, రోడ్ల వెంబడి పిచి్చమొక్కల తొలగింపు, దోమల నివారణ మందుల స్ప్రేయింగ్, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, శిథిలభవనాల కూల్చివేతలు, వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్లకు స్థలాల సేకరణ వంటి కార్యక్రమాలు పట్టణ ప్రగతిలో నిర్వహిస్తాం.  
– గద్వాల్‌ విజయలక్షి మేయర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement