సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌన్సిల్ హాల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య పోటాపోటీ వాగ్వాదం నెలకొంది. పలు సమస్యలపై ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన
మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన సమావేశంలో ఎస్‌ఆర్‌డీపీ రెండోదశ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, జిహెచ్ఎంసి బకాయిలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేశారు. శానిటేషన్ పై చర్చ జరపాలని పట్టుబట్టారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ కార్మికులకు, గ్రేటర్ ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
మేయర్ ఆగ్రహం
బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసనను తప్పుబట్టిన మేయర్.. ఏదైనా ఉంటే ప్రశ్నోత్తరాల్లో అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ జరగకుండా అడ్డుపడితే మార్షల్‌తో బయటకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల కోసం కౌన్సిల్‌ను సజావుగా నడవాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించి 6 నెలలు గడుస్తోందని, మళ్లీ ఇప్పటి వరకు చర్చించలేదేని తెలిపారు. కార్మికుల అంశం పెద్ద సమస్యేనని, చర్చలు జరిపిన తరువాత కార్మికులపై ప్రకటన చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేలకు బానిసలుగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైందని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గ్రేటర్ సిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్పొరేటర్లను లెక్కచేయడం లేదని దుయ్యబట్టారు. ప్రోటోకాల్ లేకున్నా ఎమ్మెల్యేకు నచ్చిన వాళ్ళు రావాలి.. ఎమ్మెల్యేకు నచ్చకపోతే ప్రోగ్రాం క్యాన్సల్ అవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు బానిసలుగా తయారు అయ్యాదని విమర్శించారు. డివిజన్ కార్యాలయాల్లో కనీసం జాతీయ జెండా ఎగరేసే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కమిషనర్ రోడ్లపై తిరుగుతున్నారని, మేయర్ కూడా సిటీలో పర్యటించాలని సూచించారు.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హల్‌లో తమ నేతల పేర్లపై బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల పోటీపోటీగా నినాదాలు చేశారు. గ్రేటర్ సిటీ అభివృద్ధి కేటీఆర్, కేసీఆర్ వల్లే జరిగిందని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. గ్రేటర్ సిటీలో కేంద్రం పాత్ర, కిషన్ రెడ్డి పాత్ర ఉందని బీజేపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. పేర్లను తీసుకోవద్దని మేయర్ ఇరువుకి సూచనలు చేశారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు నిరసన ఆపాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.
ప్రోటోకాల్ సమస్య
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రోటోకాల్ సమస్య అందరికీ ఉందని మేయర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ప్రోటోకాల్ సమస్యపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారులతో రివ్యూ చేస్తామని చెప్పారు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కార్పొరేటర్ పేరు ఉండాలని తెలిపారు.
మేయర్ Vs విజయారెడ్డి
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హల్‌లో మేయర్ వర్సెస్ విజయారెడ్డిగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అడ్డుపడ్డారు. కార్మికులకు జీతాలు పెంచితే విజయారెడ్డి పాలాభిషేకం చేశారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని అడగటం చైర్‌ను అవమానించినట్లు కాదని, మేయర్ చైర్‌ను తాను అవమానించలేదని తెలిపారు.
కొత్త కాంట్రాక్టు ఇవ్వడం వల్ల స్ట్రీట్ లైట్ల సమస్య ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. గత నెల రోజుల్లో 6వేల కొత్త లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 6 దల నుంచి వెయ్యి లైట్ల ఫిట్టింగ్ చేస్తున్నామన్నారు. సరైన విధంగా లైట్ల మెంటనెన్స్ లేనందున ఆయా సంస్థలకు 6కోట్ల ఫైన్స్ వేశామని తెలిపారు. కార్మికుల సమస్యలపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మేయర్‌తో మాట్లాడిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment