ఫైల్ ఫోటో
భైంసా (ముధోల్)/ధరూరు: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం నుంచి నది వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన హరిహర కాటేజ్ నీట మునిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా నదిలో వరద ప్రవాహం మాత్రం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. అర్ధరాత్రి 12 తర్వాత బాసర ఆలయం వైపు వెళ్లే మార్గాన్ని సైతం ముంచెత్తింది. ఇదే మార్గంలో ఉన్న హరిహర కాటేజ్ నీట మునిగింది.
అందులో ఉన్నవారంతా అప్రమత్తమై స్లాబుల పైకి వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. పడవల సాయంతో కాటేజ్ వద్దకు చేరుకుని 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరోవైపు వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతూ మధ్యాహ్న సమయంలో శ్రీకృష్ణ ఆలయానికి తాకింది. రైల్వే వంతెన నుంచి స్నానఘట్టాల వరకు ఉన్న పొలాలన్నీ నీటమునిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు.
జూరాలకు మళ్లీ వరద
ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తింది. బుధవారం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 20 క్రస్టు గేట్లను ఎత్తి 1,27,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలోని 11యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1,60,553 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.214 టీఎంసీలు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment