నేటి నుంచి కోట బోనాలు
భారీ ఎత్తున ఏర్పాట్లు
ముస్తాబైన అమ్మవార్లు
గోల్కొండ: బోనాలకు వేళైంది. గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.
మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి భారీ ఎత్తున తాగునీటి ఏర్పాట్లు చేస్తోంది. జలమండలి డీజీఎం ఖాజా జవహర్ అలీ సిబ్బందితో తాగునీటి ట్యాంకర్లను పెట్టిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరమైయ్యే అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ వారు మొబైల్ ఫైర్ ఎస్టింగిషర్‌ను కూడా సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణలను పూర్తి చేశారు. పోలీసులు లంగర్‌హౌజ్ నుంచి గోల్కొండ వరకు పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా పోలీస్ టీమ్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు.
సప్త మాతృకలకు.. బంగారు బోనాలు..
చార్మినార్: నగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించనున్నామని భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పాతబస్తీ మీరాలంమండి మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనంతో గోల్కొండ కోటకు బయలుదేరుతామన్నారు.
లంగర్‌హౌజ్ వద్ద ఏర్పాటు చేసే స్వాగత వేదికపై నుంచి మంత్రులు స్వాగతం పలుకుతారని ఆయన తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలను నగరంలోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజా సింహవాహిని దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గోల్కొండ జగదాంబ అమ్మవారికి, 10న బల్కంపేట ఎల్లమ్మ, 12న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 14న విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, 18న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి, 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, 25న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవార్లకు బంగారు బోనం, పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment