సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అక్షరాస్యత, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత, స్థానిక విక్రేతలతో ఒప్పందాలు వంటి వాటి ద్వారా గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, భాగస్వామ్యాలకు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా పెట్టుబడులు, బ్యాంకింగ్, సెక్యూరిటీలు, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో పేరొందిన గోల్డ్‌మన్ సాచ్స్ గురువారం ఇక్కడి నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ‘ఓపెల్’ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్‌ల వాతావరణం మరింత బలోపేతం కావడంతోపాటు స్థానిక నైపుణ్యానికి అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
తమ సంస్థ రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానంలో హైదరాబాద్, బెంగుళూరు అంతర్భాగంగా ఉన్నాయని గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ నోడ్ అన్నారు. కార్యక్రమంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమ్తానీ, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యాలయంలో 2,500 మందికి వసతి
ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, కన్జూమర్ బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర రంగాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం గోల్డ్‌మన్ సాచ్స్ 2021లో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 1,500 మంది నిపుణులు ఇక్కడ పనిచేస్తుండగా తాజాగా నాలెడ్జ్ సిటీలోని సలార్‌పురియా సత్వ నాలెడ్జ్ పార్క్‌లో 3.51 లక్షల చదరపు అడుగులలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో 2,500 మంది నిపుణులు కూర్చునేందుకు అనువైన ఆధునిక వసతులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment