ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్‌ | Government Employees Salary Increase In Telangana Says KCR | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ న్యూ ఇయర్‌‌ కానుక

Dec 29 2020 7:15 PM | Updated on Dec 29 2020 7:40 PM

Government Employees Salary Increase In Telangana Says KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త సంవత్సర కానుకను ప్రకటించారు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలను పెంచాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని 9,36,976 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అధ్యక్షతన ఓ కమిటిని నియమించారు. కొత్త ఏడాదిలో మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. 

9,36,976 ఉద్యోగులకు లబ్ధి..
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  

ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ
వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.  ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని ముఖ్యమంత్రి నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. 

ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది
వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం క్యాబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం  అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది.

తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement