ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కరీంనగర్: నాలుగు నెలలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు. కరోనా సృష్టించిన భయోత్పాతానికి విద్యారంగంపూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాతే ప్రభుత్వాలు, అధికారులు తరగతులు పునఃప్రారంభించాలని అనుకున్నా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి సర్కారు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ క్లాసులపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి కాగా ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని సూచించింది. నాలుగు నెలల విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది.
సెప్టెంబర్ 1 నుంచి నూతన విద్యాసంవత్సరం
కరోనా ఎఫెక్ట్‌తో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్చిలో విధించిన లాక్‌డౌన్ వల్ల వాటికి పడిన తాళాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. రెండు నెలల కిందట సడలింపులు ఇచ్చినా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. సుమారు నాలుగున్నర నెలలుగా విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటున్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలని విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించనుంది. 27 నుంచి క్రమంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేయడం ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. దీంతోపాటు టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు బోధించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ దృష్టి..
జిల్లాలో 649 ప్రభుత్వ పాఠశాలలుండగా ఇందులో ప్రాథమిక పాఠశాలలు 424, ప్రాథమికోన్నత 76, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 149 ఉన్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 34,600 మంది విద్యార్థులున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠ్యపుస్తకాలు పంపిణీ కూడా పూర్తిచేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగం ఇది వరకే ఆన్‌లైన్ పాఠాల సాధ్యాసాధ్యాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయా లేదా అన్న వివరాలను సేకరించి పాఠశాల విద్యాశాఖకు నివేదిక సమర్పించింది.
ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో సెల్‌ఫోన్ మీద ఆధారపడ్డ వారికి మొబైల్ నెట్‌వర్క్ సమస్యలున్నాయని తేలింది. వీరికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించి అందరికీ విద్యనందించే ప్రయత్నాలు విద్యాశాఖ యంత్రాగం సిద్ధం చేస్తోంది. మరో వారం రోజుల తర్వాత విద్యార్థిని, విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment